ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? ఎక్కడెక్కడ వెంచర్లు పడుతున్నాయి? ఖరీదెంత? గజం ఎలా? ఎస్ ఎఫ్‌టీ ఎంత చెబుతున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది?.. ఇవీ.. ఆదివారం రోజు రోజంతా.. అమరావతిలో కనిపించిన సందడి!. నిజం!!. తాజాగా ఆదివారం అమరావతిలో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు చెందిన వారు సంచరించారు. ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాదు.. అమరావతిలో భూముల సమీకరణ జరుగుతున్న పరిస్థితులను కూడా వాకబు చేశారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల నుంచి మధ్యతరగతి వర్గాలు కూడా ఆదివారం పెద్ద ఎత్తున ఇక్కడకు తరలి రావడం కనిపించింది. సాధారణంగా.. గత ఐదేళ్లలో ఎప్పుడు ఇలాంటి వాతావరణం కనిపించలేదు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..తొలి మూడు నాలుగు మాసాలు బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత మాత్రం రియల్ ఎస్టేట్ బూం తగ్గింది. దీంతో పెద్దగా ఎవరూ రాలేదు. దీనిపై కూడా పెద్దగా చర్చించనూ లేదు. కానీ.. అనూహ్యంగా ఆదివారం మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో సందడి ఏర్పడింది.
ఏంటి కారణం?
రాజధాని పనులు ప్రారంభం కావడమే దీనికి కారణమని అనుకున్నా.. మరో ప్రధాన కారణం కూడా ఉందని తెలుస్తోంది. రాజ ధానిని మరింత విస్తరించడంతోపాటు.. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికితోడు.. గుంటూరు-తెనాలి-మంగళగిరి-విజయవాడలను కలుపుతూ.. ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై సర్కారు ఆలోచన చేస్తోంది. ఇదే జరిగితే.. రాజధాని ప్రాంతం రేడియస్ పెరగనుంది. అంతేకాదు.. కృష్ణా నదిపై ప్రత్యేకంగా.. ఈ నాలుగు ప్రాంతాలపరిధిలో రెండు ఐకానిక్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాధాన్యం పెరుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో కూటమి మళ్లీ వస్తుందన్న ఆశలు చిగురించడం కూడా.. రియల్ ఎస్టేట్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నా రన్న చర్చ ఉంది.అయితే.. ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా ప్రజలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయం తెలిసిన కొన్ని చానెళ్లు.. ఇక్కడ కొందరిని కదిలించినప్పుడు.. భూములు కొనేందుకు వచ్చామనికొందరు చెప్పగా.. వెంచర్లు చూసేందుకు వచ్చామని కొందరు చెప్పారు. మొత్తంగా అమరావతి విషయంలో మరోసారి రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates