బైరెడ్డి శబరి. రాజకీయాల్లో ఒకప్పుడు చాలా సైలెంట్‌గా రంగ ప్రవేశం చేసి.. తర్వాత కాలంలో పుంజుకున్న నాయకురాలు. అయితే.. ఆమె రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. అంత తేలికగా ఆమె పుంజుకోలేదనే చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో కొత్త పార్టీ పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రం లేదా.. కర్నూలును తెలంగాణలో కలిపేయాలన్న డిమాండ్‌తో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఉద్యమించా రు. ఈ సమయంలో ఆయన జైలు పాలయ్యారు. అప్పుడే తొలిసారి శబరి రాజకీయ అరంగేట్రం చేశారు. తర్వాత కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. గత ఎన్నికలకు ముందు వరకు కూడా కమలం పార్టీలోనే కొనసాగారు.
గత ఎన్నికల సమయంలో నామినేషన్ల గడువుకు ముందు అనూహ్యంగా టీడీపీలోకి వచ్చినా ఆమె ఎంపీ టికెట్ ను దక్కించు కున్నారు. అప్పటి వరకు శబరి రాజకీయాలు ఒక లెక్క అయితే.. అప్పటి నుంచి మరోలెక్కగా మారాయి. నంద్యాల ఎంపీగా.. బయట ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రుల వరకు కూడా శబరి మంచి ట్రాక్‌నే ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఎటొచ్చీ.. ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా.. ఆమెకు సొంత పార్టీలోనే సెగ ప్రారంభమైంది. వాస్తవానికి శబరిని గత ఎన్నికల్లోనే ఓడించేందుకు కొందరు ప్రయత్నించారన్న వాదన కూడా ఉంది.
ఈ కారణంగానే ఆమె కొందరు నాయకులకు దూరంగా ఉన్నారు. వారిపై కొన్నాళ్ల కిందటి వరకు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నంద్యాల పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు-ఎంపీకి మధ్య భారీ గ్యాప్ పెరిగేలా చేసింది. పైకి అందరూ కామన్‌గా నవ్వుతూను ఉంటారు. కానీ, లోలోన మాత్రం కత్తులు నూరుతున్నారు. ఇదీ.. నంద్యాల ఎంపీ పరిస్థితి. అయితే.. తానైనా సర్దుకుపోవాలన్న ఉద్దేశంతో శబరి ఉన్నారా? అంటే.. అదేమీ లేదు. సై అంటే సై అన్నట్టుగానే రాజకీయాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో శబరి రాజకీయాలు .. బరాబర్ సవాళ్లతోనే ముందుకు సాగుతున్నాయి.
ప్రస్తుతం నంద్యాలలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సమయంలో వెలుగు చూసిన వివాదానికి పునాదులు చాలాలోతుగానే ఉన్నాయన్నది పరిశీలకుల మాట. గత ఎన్నికల సమయంలో శబరికి ఆర్థికంగా సాయం చేసిన వారిలో కొందరికి ఇప్పుడు ఆమె సాయం చేయకపోవడం కూడా దీనికి కారణంగా మారింది. వీరంతా ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండడంతోపాటు.. శబరికి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. ఈ పరిణామాలే.. రాజకీయంగా శబరికి సవాళ్లు తెస్తున్నాయి. పాణ్యం నుంచి నంద్యాల వరకు శబరికి వ్యతిరేక అజెండానే కొనసాగుతోందన్నది వాస్తవం. అయితే.. సమస్యలను ఎదుర్కోవడం తనకు కొత్తకాదని చెప్పే ఆమె.. వీటిని సర్దుబాటు చేసుకోకుండా.. సవాళ్లతోనే ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates