రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. పరిస్థితులు, ప్రభావాలు ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునేలా చేస్తాయి. ముఖ్యంగా రాజకీయాలలో అవకాశం-అవసరం అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఏ చిన్న అవకాశం చిక్కినా.. పార్టీలు వదులుకునేందుకు ఛాన్స్ ఇవ్వవు. ఇదే.. కూటములు కట్టేందుకు.. పొత్తులు పెట్టేందుకు అవకాశం ఏర్పడేలా చేస్తుంది. తెలం గాణ విషయంపైనా తాజాగా ఇదే చర్చ తెరమీదికి వచ్చింది. ఏపీలో కూటమి కట్టిన బీజేపీ-జనసేన-టీడీపీలు సక్సెస్ అయ్యాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పక్షాలు విజయ దుందుభి మోగించాయి.
కనీవినీ ఎరుగని విధంగా 164 స్థానాల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చాయి. ఏడాది తర్వాత కూడా.. కూటమి బలంగానే ఉంది. ఎక్కడైనా చిన్న చిన్నలోపాలు ఉన్నాయే తప్ప.. ప్రధానంగా చూస్తే.. బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య చెప్పుకో దగిన లోపాలు.. కుమ్ములాటలు ఎక్కడా లేవనేది తెలుస్తూనే ఉంది. అంతేకాదు.. వచ్చే 15 సంవత్సరాలు కూడా కూటమి కలిసి ఉంటుందని మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, టీడీపీలు పదే పదే చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలోనూ ఈ కూటమి పోటీ చేసే అవకాశం ఉందంటూ.. ఓ మీడియా కథనంలో వచ్చిన అంశం రాష్ట్రంలో చర్చకు దారితీసింది.
రాజకీయాల్లో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమికి తెలంగాణలో పోటీ చేయకూడదన్న భావన అయితే ఉండదు. పైగా.. తెలంగాణలో టీడీపీ, జనసేనలు కూడా ఉన్నాయి. అవి ప్రస్తుతానికి ఏపీకి మాత్రమే పాలనను పరిమితం చేసి నా.. రాజకీయంగా టీడీపీ తెలంగాణలో యాక్టివ్‌గానే ఉంది. జనసేన విషయానికి వస్తే.. మాత్రం.. కొంత సంస్థాగతంగా బలోపేతం కావాల్సి ఉంది. ఇక, తెలంగాణలో బీజేపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో.. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా తెలంగాణలో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఎన్నికలకు ఇంకా మూడేళ్లకుపైగానే సమయం ఉంది. అప్పటిలోగా తెలంగాణపై కూడా కూటమి నిర్ణయం తీసుకుంటే.. పోటీ ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీకి సంస్థాగతంగా తెలంగాణలో బలం ఉంది. ముఖ్యంగా సెటిలర్లు, వ్యాపారులు ,.. కూడా ఆ పార్టీకి అనుకూలం. ఇక, జనసేన యువతను ఆకర్షించే విషయంలో ముందుంది. సో.. బీజేపీకి ఈ రెండు పార్టీలు తోడైతే.. విజయందక్కించుకుని తొలిసారి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
మరీ ముఖ్యంగా బీఆర్ ఎస్ పాలన చూసిన ప్రజలు.. కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కూటమికి కూడా అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. ప్రస్తుతానికి ఇది వాదనగానే ఉంది. మున్ముందు ఏం జరుగుతుంది? అనేది చూడాలి. అయితే.. ఏపీకి చెందినపార్టీలుగా ముద్ర పడిన నేపథ్యంలో టీడీపీ, జనసేన విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది కూడా కీలకమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates