ఉలిక్కిప‌డ్డ వైసీపీ.. ఒకేసారి 113 మందిపై కేసు!

ఎలాంటి కేసులు వ‌చ్చినా.. ఎంత మందిని జైల్లోకి నెట్టిన బేఫిక‌ర్ అంటూ.. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌దేప‌దే.. కేసులు పెడ‌తారా పెట్టుకోండి.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్య ప‌రిస్థితి ఎదురైంది. వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కులు స‌హా, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారికి మొత్తంగా 113 మంది ఒకేసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిపై కేసులు కూడా పెట్టారు.

ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో వైసీపీ అధినాయ‌క‌త్వం ఉలిక్కిప‌డింది. ఏం జ‌రిగింది? అంటూ.. జ‌గ‌న్ ఆరా తీసే ప‌రిస్థితి వ‌చ్చింది. గ‌త నెల 18న జ‌గ‌న్ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని రెంట‌పాళ్ల గ్రామం లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సింగ‌య్య అనే కార్య‌క‌ర్త కాన్వాయ్ కింద ప‌డి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ఒక‌వైపు న‌డుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆనాడు పోలీసుల మాట విన‌లేద‌ని.. ప్ర‌జ‌ల ఆస్థుల‌ను ధ్వంసం చేశార‌ని పేర్కొంటూ.. పోలీసులు 113 మందిపై ఒకేసారి కేసులు పెట్టారు.

పోలీసుల అనుమ‌తి లేకుండా.. ర్యాలీ నిర్వ‌హించ‌డంతోపాటు.. వాహ‌నాల‌కు డీజే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రజలు, స్కూల్స్, ఆస్పత్రులకు ఇబ్బంది కలిగించార‌ని పేర్కొంటూ.. న‌మోదు చేసిన కేసులో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర‌రావు, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాశ్, తదితర 113 మంది నేతలపై కేసు నమోదు చేశారు.

దీంతో ఒక్క‌సారిగా వైసీపీలో క‌ల‌క‌లం రేగింది. అస‌లు ఏం జ‌రిగింది? ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఏం చేశారు.? ఈ ఘ‌ట‌న జ‌రిగి 20 రోజుల త‌ర్వాత‌.. కేసులు న‌మోదుచేయ‌డం రాజ‌కీయ క‌క్ష‌లో భాగ‌మ‌ని తాడేప‌ల్లి నాయ‌కులు వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టులో తేల్చుకుంటామ‌ని వ్యాఖ్యానించారు.