“ఐదేళ్లు అధికారంలో ఉండగా.. కార్యకర్తలను పట్టించుకోలేకపోయాం. ఇప్పటి నుంచి వారికి ప్రాధాన్యం ఇస్తాం. జగన్ 2.0లో కార్యకర్తలే ప్రధానం. వారిని ఇక పై వదిలి పెట్టను.” ఇదీ.. ఈ ఏడాది ప్రారంభంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. ఇక, అప్పటి నుంచి కార్యకర్తల కేంద్రంగా కొంత మేరకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కానీ, వారి సంతృప్తి ఎలా ఉన్నా.. వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో కార్యకర్తల తల్లిదండ్రులు.. వారిని బయటకు పంపించేందుకు సిద్ధంగా లేరు. గత కొన్నాళ్లుగా ఎదురవుతున్న పరిస్థితులు.. పోలీసుల చర్యలతో కార్యకర్తల కుటుంబాల్లోనూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 9న జగన్ చిత్తూరు పర్యటన పర్యటన పెట్టుకున్నారు. ఇది వైసీపీకి చాలా ప్రతిష్టాత్మక జిల్లా. ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తం గా ఎదురు దెబ్బలు తగిలినా.. ఇక్కడి కీలక నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. పుంగనూరు, తిరుపతి(ఎంపీ) వంటి వాటిలో గెలుపు గుర్రం ఎక్కింది. పైగా.. సీఎం చంద్రబాబు సొంత జిల్లా. ఇక్కడ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు మరింత వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక్కడి రైతులు కొన్నాళ్లుగా చిత్తూరు మామిడి(తోతాపురి) గిట్టు బాటు ధరలు రాక ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు ప్రయత్నిస్తున్నా.. వారి కష్టాలు తీరడం లేదు.
దీంతో తోతాపురి రకం మామిడి పండించే రైతులను కలుసుకునేందుకు జగన్ ఈ నెల 9న చిత్తూరులో పర్యటించనున్నారు. దీనికి పెద్ద ఎత్తున హంగామా చేయాలని స్థానిక ఎమ్మెల్యే సహా ఎంపీ నిర్ణయించుకున్నారు. శనివారం సాయంత్రం.. పుంగనూరులోని పెద్దిరెడ్డి ఎస్టేట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు.. మరింత మందిని జోడించుకుని రావాలని.. జగన్ సర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు. అయితే.. వాస్తవానికి ఈ సమావేశానికే 500 మంది వస్తారని భావించి ఏర్పాట్లు చేశారు. వైసీపీ కార్యకర్తలకు భోజనాలు, కానుకలు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కానీ.. 200 నుంచి 150 లోపు కార్యకర్తలే హాజరయ్యారు. వారు కూడా.. అనేక ప్రశ్నలు సంధించారు.
ఇప్పటికే పొదిలి, గుంటూరు జిల్లాల్లో పర్యటనల సందర్భంగా ఎదురైన అనుభవాలు.. పోలీసుల కేసులను వారు ప్రస్తావించారు. ఆయా పర్యటనల్లో హద్దు మీరారంటూ.. పదుల సంఖ్యలో కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కొందరు జైళ్లలో ఉన్నారు. ఈ పరిస్థితిని వారు ప్రస్తావించి.. తమపై కేసులు నమోదైతే.. ఏం చేస్తారో చెప్పాలని ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన చిత్రమైన సమాధానం చెప్పారు. సీఎంగా జగన్ వస్తారని.. ఆయన రాగానే కేసులన్నీ మాఫీ చేస్తారని అన్నారు.
కానీ, కార్యకర్తలు అడిగింది.. ఇప్పుడు కేసులు పెడితే.. ఎప్పుడో తీసేస్తారని ఎలా చెబుతారని.. కనీసం తమకు రక్షణ కల్పిస్తేనే వస్తామని అన్నారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని.. కేసులకు భయపడేవాళ్లు రావొద్దని తెగేసి చెప్పారు. దీంతో సగం మంది కార్యకర్తలు ఇలాగైతే రాలేమని చెప్పేశారు. మొత్తానికి కార్యకర్తలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలోనూ నాయకులు విఫలమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates