జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం నాటి ప్రకాశం జిల్లా పర్యటనలో బాగంగా వైసీపీ తీరుపైనా, ఆ పార్టీ అధినేత జగన్ తీరుపైనా నిప్పులు చెరిగారు. పవన్ కామెంట్లకు తాజాగా శనివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాని.. పవన్ అసలు పాలన పట్టకుండా కాలం వెళ్లదీస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాకుండా పవన్ ఆధ్వర్యంలోని శాఖల్లోనే జరుగుతున్న తంతు కూడా పవన్ కు తెలియడం లేదని కూడా ఆయన ధ్వజమెత్తారు.
పవన్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఏం జరుగుతుందో అసలు పవన్ కు తెలుసా? అని నాని ప్రశ్నించారు. 15 ఆర్థిక సంఘం నిధుల కింద తొలి, రెండో పంచాయతీ నిధుల కింద ఏకంగా రూ.2,800 కోట్లు వస్తే… వాటిని .పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తే పవన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. అదే సమయంలో పంచాయతీల సొంత నిధులను కూడా చంద్రబాబు ఫ్రీజ్ చేసి వాడుకుంటూ ఉంటే పవన్ నిద్రపోతున్నారా? అని కూడా పవన్ ధ్వజమెత్తారు. మీ పార్టీ నేత ఆద్వర్యంలోని సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల గురించి పవన్ ఎందుకు నోరెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.
పవన్ తానేదో ఉద్ధరిస్తున్నానని చెబుతున్నారన్న నాని… ఎవరిని ఉధ్ధరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇతరుల విషయం పక్కనపెడితే కనీసం జనసేన కార్యకర్తలకు అయినా ఏమైనా చేశారా అని ఆయన నిలదీశారు. అసలు గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలపై జనసేన సర్పంచ్ లను అయినా పిలిచి మాట్లాడారా? అని ప్రశ్నించారు. కొడుకులను హెలికాఫ్టర్ లో ఎక్కించుకుని తిరగడం తప్పించి పవన్ కల్యాణ్ చేస్తున్నదేమిటని ఆయన ఎద్దేవా చేశారు. దళిత మహిళ అయిన అనిత శాఖను తీసుకుంటానని ప్రకటించిన పవన్… తన పార్టీ నేత ఆధ్వర్యంలోని సివిల్ సప్లైస్ ను తీసుకుంటానని ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.
పనిలో పనిగా తమ హయాంలో కూడా సివిల్ సప్లైస్ లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని నాని ఒప్పుకోవడం గమనార్హం. తమ హయాంలో సైకిళ్ల మీదో, బైక్ ల మీదో బియ్యాన్ని తరలించేవారని, కూటమి హయాంలో మాత్రం షిప్ ల మీద షీప్ లు రేషన్ బియ్యంతో తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తిరుపతిలో కిలో బియ్యంలో ఏకంగా 260 గ్రాములను దోచేస్తున్నా కూటమి సర్కారుకు పట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ మాట్లాడిన పలు అంశాలపై ఇంకా నాని చాలానే మాట్లాడారు గానీ… సివిల్ సప్లైస్ లో తమ హయాంలో కూడా అక్రమాలు జరిగాయని ఒప్పుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates