నిరంతరం జనాల మధ్య ఉండడం అనేది రాజకీయ నాయకుల వ్యూహం. జనాలకు చేరువైతే రేపు ఎన్నికల్లో వారికి మరింత చేరువ అయ్యేందుకు, వారి ఓట్లను దూసుకునేందుకు అవకాశం ఉంటుందనేది నాయకుల ఆలోచన. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాలుగు అడుగులు ముందే ఉన్నారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. నిరంతరం ప్రజలతోనే ఉన్నారు. జన్మభూమి వంటి సేవా కార్యక్రమాలకు ప్రజల మధ్య తిరిగారు. 2014- 19 మధ్య కూడా నిరంతరం ప్రజలతోనే ఉన్నారు. ఇది ఆయనను ఒక విలక్షణ నాయకుడిగా మార్చింది.
ప్రజల మధ్య ఎప్పుడూ చర్చకి వచ్చేలా నిలబెట్టింది. ఇప్పుడు కూడా జగన్ హవాను తగ్గించే ఉద్దేశం.. జగన్ గురించి ప్రజల్లో చర్చ రాకుండా ఉంచాలనే ప్రధాన వ్యూహంతో చంద్రబాబు నిరంతరం జనాల మధ్య తిరుగుతున్నారు. ఇది ఎంతగా అంటే ఏడాదిలో 130 నుంచి 150 రోజులు ఆయన ప్రజల మధ్య ఉంటున్నారనేది టిడిపి నాయకులు వేస్తున్న అంచనా. ప్రతినెలా ఒకటో తారీకు కచ్చితంగా ప్రజల్లో ఉంటున్నారు. సామాజిక పింఛన్లను స్వయంగా పంపిణీ చేస్తున్నారు. పేదల ఇళ్లకు వెళ్తున్నారు. వారి ఇళ్లలో కాఫీ టీలు పెట్టి తాను తాగుతూ.. వారికి కూడా అందిస్తున్నారు. ఇది ఒక కీలక పరిణామం.
అయితే ఆ తర్వాత కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ రెండు నెలలకు ఓసారి కచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని హాజరవుతున్నారు. అక్కడి ప్రజలకు చేరువవుతున్నారు. జనంతో ఇంత లోతుగా కలిసి పోవడం, వారి మధ్య ఉండడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు మరింతగా దూకుడు పెంచారు. నిజానికి గత ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయం దక్కించుకున్న తర్వాత మరో నాలుగు సంవత్సరాల వరకు ఆయన ఆఫీసుకే పరిమితమైనా ఎవరు అడిగే అవకాశం లేదు.
పైగా కూటమి ఎలాగో అండగా ఉంది. కాబట్టి ఆయనకి ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి రావాలని ఆలోచన లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ గత ఏడాది కాలంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికాలంలోనే 130 నుంచి 150 రోజులపాటు ప్రజల మధ్య ఉండడం వివిధ కార్యక్రమాల నిర్వహించడం వంటివి ప్రజలతో మరింతగా చంద్రబాబు సంబంధాలను పెంచుకుంటున్నారనే ఒక వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ఇది భవిష్యత్తు రాజకీయాలకే కాదు, వ్యక్తిగతంగా ఆయనకు మరింత ఇమేజ్‌ను పెంచడంతోపాటు ప్రతిపక్షం గురించి ప్రజల్లో చర్చ లేకుండా చేయాలన్న ప్రధాన వ్యూహాన్ని స్పష్టం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇది ఒక సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. గతంలోనూ చంద్రబాబు ప్రజల మధ్య ఉన్నప్పటికీ ఈ తరహాలో ఏడాదికి 130 నుంచి 150 రోజులపాటు ఆయన లేరని మహా అయితే 70 నుంచి 80 రోజులు మాత్రమే ప్రజల మధ్య ఉన్నారని అంటున్నారు. కాబట్టి ప్రస్తుతం చంద్రబాబు జనంతో మంచి దోస్తీ ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది స్పష్టం అవుతుంది. మరి ఇది ఏ మేరకు ఆయనకు లాభిస్తుంది అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates