చంద్రబాబుకు ఒక కీలక లక్షణం ఉంది. ముందు తాను అప్పగించిన పనిని పూర్తి చేయాలని ఆయన చెబుతారు. ఆ తర్వాత.. నాయకులు చెప్పే మాటలు వింటారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయ త్నిస్తారు. తాజాగా కొందరు.. నాయకులు సీఎంవోకు క్యూకట్టారు. వీరిలో ఉమ్మడి తూర్పు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. పలు అర్జీలతో సీఎంవోకు వచ్చిన వారు చాలా సేపు వెయిట్ చేశారు.
అయితే.. చివరకు చంద్రబాబే బయటకు వచ్చి.. వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ తమ డిమాండ్లు వినిపించారు. పదవులు.. గుర్తింపు.. సహా.. తమ నియోజకవర్గంలో సమస్యలను ఏకరువు పెట్టారు. ఇదే సమయంలో కొందరు వైసీపీ నాయకుల పై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబుకు విన్నవించారు. అయితే.. చంద్రబాబు వారిని ఉద్దేశించి రెండు కీలక ప్రశ్నలు అడిగారు.
“ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని చెప్పాం. మీ మీ ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి మీరు ఎందుకు పాల్గొనలేదు. ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు బాధ్యత లేదా? ముందు ప్రజలను కలిసి వారి సమస్యలు వినండి. ఆ తర్వాత.. మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే మీదగ్గరకు వస్తాను. ఏం చేయాలో అది చేస్తా” అని అన్నారు. అంతే.. ఇంక మిగిలిన తమ్ముళ్లు కూడా కిక్కురు మనకుండా… జేబుల్లో చేతులు పెట్టుకుని తిరిగి కూడా చూడకుండా వెనక్కి వచ్చేశారు.
ఏదేమైనా.. బాబు నిబద్ధతకు పెద్దపీట వేస్తారు. ఆయన చెప్పింది.. విని.. చేయమన్నది చేసిన వారికి.. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ మంచి మార్కులు పడ్డాయి. పడుతున్నాయి. గతంలో అనిత..డాక్టర్ సుధాకర్ వ్యవహారం పై హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఆమెకు మంచి మార్కులు వేశారు. ఇలా.. నాయకులు ప్రజల సమస్యలపై స్పందించాలని కోరుకుంటున్నారు. కానీ, కొందరు నాయకులు పదవులు పట్టుకుని వేలాడేందుకు ప్రయత్నించడమే బాబుకు నచ్చడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates