భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్నాయి. ఆగస్టు వరకు దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలకమైన పలు బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు రెడీ అయింది. వీటిలో వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో పాటు.. జన గణనతోపాటు కుల గణన చేపట్టే బిల్లులను కూడా కేంద్రం తీసుకురానుంది. జన గణనకు అయితే.. చట్టం అవసరం లేకపోయినా.. దీంతోపాటు కలిపి కుల గణన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రిపేర్ చేస్తున్నారు.
ఇది సర్కారు వైపు స్టోరీ. కానీ, ప్రతిపక్షాల విషయానికి వస్తే.. పార్లమెంటు వేదికగా ‘ఆపరేషన్ సిందూర్’.. అనంతర పరిణామాల పై అట్టుడికించనున్నారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆనాటి దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. దీనికి ప్రతిగా.. భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 9 చోట్ల ఉగ్రవాదుల శిబిరాలను నేల మట్టం చేసింది.
ముఖ్యంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత కుటుంబాన్ని తుదముట్టించింది. దీని వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. అసలు ఉగ్రవాద దాడికి ముందు.. తర్వాత పరిణామాల పై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉగ్రవాద దాడి జరిగిన ఏప్రిల్ 22 సమయంలో ప్రధాని విదేశాల్లో ఉన్నారు. ఆయన అంతకు ముందు రోజు విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారన్నది ప్రతిపక్ష కాంగ్రెస్ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ముందుగానే పహల్గాం దాడి గురించి మోడీకి తెలుసునన్నదివారి వాదన.
ఇక, ఆపరేషన్ సిందూర్ ను అర్ధంతరంగా ముగించడం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారని.. ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భారత్‌పై సుంకాలు విధిస్తామని.. వాణిజ్యం నిలుపుదల చేస్తామని హెచ్చరించడంతోనే దారికి వచ్చారన్నది ఆయన చెప్పిన మాట. అప్పటి నుంచి దీనిపై కేంద్రం సమాధానం కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా మోడీ స్పందన కోసం చూస్తున్నాయి.
కానీ, ఆయన ఎక్కడా స్పందించడం లేదు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడాన్ని చెప్పుకొస్తున్నారే తప్ప.. దీనిలో తృతీయ దేశ ప్రమేయం పై నోరు విప్పడం లేదు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ పూర్వం.. తర్వాత పరిణామాలపై పార్లమెంటు వేదికగా.. ప్రతిపక్షాలు నిప్పులు చెరిగేందుకు ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. అందుకే ఈ దఫా ‘ఆపరేషన్ పార్లమెంటు’ సమావేశాలుగా మారుతాయని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates