తెలంగాణకు మళ్లీ చెబుతున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కూర్చుని చర్చించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దీనికి నాయకులు, పార్టీలు సహకరించాలని ఆయన సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, సమన్వయం చాలా అవసరమని.. గతంలో తాము సహకరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు అనుకున్నారు.కానీ.. మేం సహకరించాం.. అని తెలిపారు.
ఇప్పుడు కర్నూలు జిల్లాలో చేపట్టే బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండబోదని మరోసారి తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసు కున్నామన్నారు. సగటున 100 సంవత్సరాల గోదావరి ప్రవాహాన్ని లెక్కించామన్నారు. కేవలం సముద్రం లోకి వృథాగా పోతున్న నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామన్నారు. అవసరమైతే.. తెలంగాణకు కూడా ఇస్తామని చెప్పారు. దీనిలో అడ్డు పడడం ద్వారా.. అనవసర సమస్యలు తెచ్చుకున్నట్టే అవుతుందన్నారు.
సముద్రంలోకి పోయే గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారన్న చంద్రబాబు.. ఇదేసమయంలో ఇరు రాష్ట్రాలకు నీటి కొరత తీరుతుందన్నారు. “ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా.. ఎవరికీ నష్టం లేదు.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బనకచర్లను కేంద్రం అడ్డుకుందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు తిప్పికొట్టారు.
దీనిని కేంద్రం అడ్డుకోలేదన్న ఆయన.. అధికారులకు కొన్ని అనుమానాలు వచ్చాయి.. వాటిని నివృత్తి చేసిన తర్వాత.. అనుమతులు ఇస్తారని అన్నారు. సహజంగా రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. నదుల అనుసంధానం కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని.. గతంలో తాము నదుల అను సంధానం చేశామని.. దీనిపై సమగ్ర రిపోర్టును ఇవ్వాలని కేంద్రం కోరిందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates