ఏడాది దాటినా ఇంకా పాత పాటలేనా..?

భారత దేశంలో రాజకీయ పార్టీలు భలే చిత్రంగా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈవీఎంలకు మద్దతుగా నిలిస్తే… ఓడిన పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తూ బ్యాలెట్ పద్దతిన ఓటింగ్ జరగాలంటూ డిమాండ్ చేస్తాయి. అంతేకాదండోయ్… ఇప్పుడు గెలిచిన పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడితే… ఆ పార్టీ కూడా తన మాట మార్చేసి తనకూ బ్యాలెట్ ఓటింగే కావాలని డిమాండ్ చేస్తుంది. ఈ తరహా విచిత్ర పరిస్థితి మన వద్దే కనిపిస్తుంది. సంచలన రాజకీయాలకు నెలవుగా మారిన ఏపీలో అయితే ఈ తరహా డిమాండ్లు మరింతగా గట్టిగా వినిపిస్తాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే మోడ్ లో ఉంది.

ఏపీ సహా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగి అప్పుడే ఏడాది దాటిపోతోంది. ఆపై ఇంకో నెల కూడా గడుస్తోంది. ఇలాంటి తరుణంలోనూ వైసీపీ తన పాత పాటనే పాడుతూ ఢిల్లీ వీథుల్లో కామెడీ పంచుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినంతనే ఎన్నికలు సజావుగా జరిగాయని, కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వైసీపీ ప్రకటించింది. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఓటమి ఎదురు కావడంతో ఈవీఎంలతో తమను మోసం చేశారని, ఎన్నికల సంఘం కూడా కూటమికే సహకరించిందని ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఈసీకి తెలిపింది.

ఈ విషయంలో వైసీపీ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అయితే ఏకంగా ఎన్నికల సంఘానికి ఓ బలమైన ఫిర్యాదే చేశారు. ఈ ఫిర్యాదును నాడే పరిశీలించిన ఎన్నికల సంఘం… అందులో వాస్తవమేమీ లేదని, అదంతా సర్వసరాధారణమని, మీరే పొరబడుతున్నారని తెలిపింది. అయినా కూడా బెల్లాన వినలేదు. తన ఫిర్యాదుపై విచారణ జరగాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. సరే…సమయం చూసుకుని పిలుస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇతరత్రా పనులు ముగించుకుని కాస్తంత విశ్రాంతి దొరికినట్లుంది… గురువారం రావాలంటూ ఎన్నికల సంఘం వైసీపీకి సమాచారం పంపింది.

ఈ పిలుపుతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్ సభలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలతో కలిసి బెల్లాన గురువారం ఉదయం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లారు. తమ వద్ద ఉన్న ఆధారాలను వారు సంఘం ప్రతినిధులకు అందజేశారు. వాటిపై ఎన్నికల సంఘం ఏం సమాధానం చెప్పిందో తెలియదు గానీ… సమావేశాన్ని ముగించుకుని బయటకు వచ్చిన వైసీపీ నేతలు… 2024 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఇకపై బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.