ఏపీలో ఒకేసారి కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ రెండు కార్యక్రమాలు చేపట్టాయి. టీడీపీ గత ఏడాది కూటమి పాలనలో జరిగిన మేలు, చేపట్టిన సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన పథకాలు వంటివాటిని వివరించే ప్రయత్నం చేసింది. దీనికి సుపరిపాలనలో తొలి అడుగు-ఇది మంచి ప్రభుత్వం అని పేరు పెట్టింది. ఇక, ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ కూడా ఇదే తరహాలో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. గత ఏడాది కిందట చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరుతో వైసీపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారు. గత మూడు రోజుల నుంచే వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే.. జూలై 2 బుధవారం నుంచి టీడీపీ కూడా ప్రజాహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రెండు కార్యక్రమాలూ కూడా ఒకేసారి ప్రజల మధ్యకు చేరినట్టు అయింది. అయితే.. ఇవి రెండు పరస్పర వ్యతిరేక కార్యక్రమాలు!. మేం మంచి చేశామని టీడీపీ నాయకులు, కాదు, వారు అసలు ఏమీ చేయలేదని వైసీపీ నాయకులు ఒకరకంగా భారీ భీకర ప్రచారానికి ఇరు పక్షాలు తెరదీశాయి. దీంతో ఈ కార్యక్రమాలు ఎలా జరిగాయన్నది ఆసక్తిగా మారింది.
టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ ప్రచురించిన ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలపై వివరాలను మరోసారి ప్రజలకు వివరించారు. పింఛన్లు అందుతున్నాయా? పథకాలు వస్తున్నాయా? అని ఆరాతీశారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలోనూ చాలా వరకు తక్కువమందే పార్టిసిపేట్ చేస్తున్నారు. కేవలం ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే ఈ కార్యక్రమానికి నాయకులు స్పందిస్తున్నారు. కార్యకర్తలు పెద్దగా రావడం లేదు. పైగా.. వర్షాలు కురుస్తుండడంతో కొన్ని గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిత్రం ఏంటంటే.. వీరు ఎంపిక చేసుకున్న ఇళ్లకు మాత్రమే వెళ్తున్నారు. సహజంగానే వారికి సానుభూతి కోణంలో ఎంపిక చేసుకున్న కుటుంబాల నుంచి సమాచారం అందుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates