ఆ వైసీపీ నేత‌ పై ‘ఈగ’ వాల‌ట్లేదు..

ఆయ‌న వైసీపీ నాయ‌కుడు. పైగా ఫైర్ బ్రాండ్‌. మాజీ మంత్రి. నోరు విప్పితే.. టీడీపీ పై విమ‌ర్శ‌ల ప‌ర్వం. జ‌న‌సేన‌ పై ఘాటు వ్యాఖ్య‌లు. ఇదీ… గ‌త ఐదేళ్లలో స‌ద‌రు నాయ‌కుడు చేసిన రాజ‌కీయం. దీంతో కూట‌మి లో నాయ‌కుల‌కు ఆయనంటే కంట‌గింపు. అవ‌కాశం-అవ‌స‌రం కోసం ఎద‌రు చూశారు. ఎప్పుడెప్పుడు అవ‌కాశం ద‌క్కుతుందా? ఎప్పుడెప్పుడు.. క‌సి తీర్చుకుందామా? అని కూడా లెక్క‌లు వేసుకున్నారు. తీరా గ‌త ఏడాదే ఇలాంటి వారికి అవ‌కాశం చిక్కింది.

కూట‌మి ప్ర‌భంజ‌నంలో స‌ద‌రు నాయ‌కుడు మైన‌స్ అయ్యారు. ప్ర‌జా వ్యతిరేక‌త‌లో కొట్టుకుపోయారు. ఆయనే నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్‌. ఈయ‌న‌ పై టీడీపీలో ఉన్న అంద‌రికీ కోప‌మే. క‌సి తీర్చుకోవాల‌న్న ఆత్ర‌మే. ఒక్క నెల్లూరులోనే కాదు.. ఉమ్మ‌డి కృష్ణా స‌హా.. ఉమ్మడి శ్రీకాకుళంలోని టీడీపీ నాయ‌కుల‌కు కూడా అనిల్ అంతు చూడాల‌నే ఉంది. ఇక‌, నెల్లూరులో అయితే.. ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గా ఉంది.

గ‌తంలో త‌మ‌ను స‌వాల్ చేయ‌డంతోపాటు.. త‌మ‌ పై తీవ్రంగా దూషించార‌ని టీడీపీ సీనియ‌ర్లు కూడా ఆవే ద‌న‌లోనే ఉన్నారు. ఇక‌, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లోనూ ఆయ‌న పేరు ఉంద‌ని అంటారు. కానీ..ఆ పార్టీ ఓడిపోయి ఏడాదైనా.. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఏడాది దాటినా.. అనిల్‌పై ఈగ కూడా వాల‌లేదు. అంతేకాదు.. అస‌లు ఆయ‌న ప్ర‌స్తావ‌నే లేకుండా పోయింది. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. అస‌లు ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా.. ఆయ‌న‌ను ఏమీ చేయ‌బోర‌ని అంటున్నారు.

దీనికి కార‌ణం.. ఇద్ద‌రు కీల‌క సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ఎంపీలు అనిల్ వెనుక చ‌క్రం తిప్పుతున్నార‌ట‌. ఆయ‌న‌ను అన్ని విధాలా ర‌క్షించేస్తున్నార‌ట‌. గ‌తంలో అంద‌రూ ఒకే పార్టీలో ఉన్న స‌మ‌యంలో త‌మ‌కు అన్నివిధాలా మేలు చేసిన అనిల్‌ను ఇప్పుడు వారే కాపాడుతున్నార‌ని ఒక టాక్ న‌డుస్తోంది. అయితే.. ఆ ఎంపీలు ఎవ‌ర‌న్న‌ది మాత్రం గోప్యంగా ఉంది.

కానీ.. వారు అంద‌రికీ తెలిసిన వారేన‌ని అంటున్నారు. వారికి గ‌తంలో అనిల్ సాయం చేయ‌డం.. (మంత్రిగా ఉన్న‌ప్పుడు), వారితో ఉన్న వ్య‌క్తిగ‌త అనుబంధాల కార‌ణంగానే అనిల్‌ను ఇప్పుడు కాపాడుతున్నార‌ని.. అందుకే ఈగ కూడా వాల‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ ర‌క్ష‌ణ ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.