పాలిటిక్స్‌లో ఒక చిత్రమైన మాట వినిపిస్తుంది. మన బలం లేనప్పుడు.. ప్రత్యర్థుల బలహీనత మనకు సాయం చేస్తుందని!. ఇది నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థుల్లో బలహీనతలను తమ బలంగా మార్చుకున్న నాయకులు ఉన్నారు. విజయం దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఇద్దరు నాయకులు రాజకీయాలుచేస్తున్నారు. వీరిలో ఒకరు అధికార పార్టీకి చెందిన నాయకులు కాగా.. మరొకరు వైసీపీకి చెందిన నాయకుడు.
సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో ఉన్నారు. కానీ.. తనకు మంత్రి పీఠం ఇవ్వలేదన్న భావనతో ఆయన పార్టీపై అలిగారు. దీంతో పార్టీలో యాక్టివిటీ తగ్గించేశారు. ఇటీవల మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చారు. అది కూడా సత్తెనపల్లిలో జరిగిన సింగయ్య మృతి ఘటనపై కన్నా రియాక్ట్ అయ్యారు. దీనికి మించి ఆయన ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. పైగా.. సొంత పార్టీలోనే ఆయన ఓ కీలక నేత కుమారుడితో విభేదిస్తున్నారు.
దీంతో టీడీపీలో కన్నా రాజకీయం ఎక్కడా కనిపించడం లేదు. కానీ.. ప్రత్యర్థి బలహీనతను వాడుకుని.. తాను యాక్టివ్‌గా ఉన్నట్టుగా కన్నా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన సింగయ్య మృతి సహా.. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును తప్పించడంపై కన్నా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. తనను చూసి.. తన హవాను చూసే వైసీపీ ఇక్కడ నుంచి అంబటిని పంపేసిందన్న వాదనను కన్నా అనుచరులు వినిపిస్తున్నారు. అంటే.. సొంత బలం కన్నా కూడా ప్రత్యర్థి బలహీనతను తనకు అనుకూలంగా వాడేస్తున్నారు.
ఇక, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన నాయకుడు పంతం నానాజీ విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న కన్నబాబు.. ప్రత్యర్థి బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకునేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ-కాకినాడ టూర్ చేస్తున్న కన్నబాబు.. ఇటీవల ఓ ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ పంతంపై విమర్శలు గుప్పించారు. అంటే.. వ్యతిరేకత నుంచి సానుకూలత తెప్పించుకునే ప్రయత్నాలుచేస్తున్నారు. మరి సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates