జ‌గ‌న్ కోసం.. కేసీఆర్ సంత‌కాలు చేశాడు: రేవంత్

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాల కోసం.. జ‌గ‌న్‌తో చేసుకున్న లాలూచీ రాజ‌కీయాల కోసం.. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఆనాడు సంత‌కాలు చేశార‌ని, దీనికి అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల మంత్రిగా హ‌రీష్‌రావు కూడా సంత‌కాలు పెట్టార‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. అందుకే.. ఇప్పుడు చంద్ర‌బాబుకు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు అయింద‌న్నారు. గోదావ‌రి జిల్లాల‌కు సంబంధించి 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆనాడు కేసీఆర్ రాజీ ప‌డ్డార‌ని అన్నారు. అందుకే తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు.

దీంతో మిగిలిన జ‌లాల‌ను ఏపీకి కేటాయించే 2015లో సంతకం చేశారని.. 2015లో కేసీఆర్‌, హరీశ్‌రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. కానీ,వాస్త‌వం అది కాద‌న్నారు. ఇది కేవ‌లం జ‌గ‌న్ కోసం జ‌ల నాట‌కంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. తెలంగాణ‌లో అనేక ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టి.. మ‌ధ్య‌లోనే వ‌దిలేశార‌ని.. వాటిని పూర్తి చేసుకుంటే.. అస‌లు గోదావ‌రి, కృష్ణా న‌దుల్లో మిగులు జ‌లాలు ఉండ‌బోవ‌ని చెప్పారు. కానీ, ఆనాడు జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాల‌కు ఇక్క‌డ అనుకూల నిర్ణ‌యాలు తీసుకున్న కార‌ణంగానే చంద్ర‌బాబు ఇప్పుడు అక్క‌డ ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుడుతున్నార‌ని చెప్పారు.

త‌ప్పంతా బీఆర్ఎస్ నాయకులు చేసి.. ఇప్పుడు త‌మ‌పై ప‌డి ఏడుస్తున్నార‌ని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌,బ‌న‌క‌చ‌ర్ల – పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన విష‌యంపై కేంద్రం తాజాగా స్పందించిన తీరును కూడా రేవంత్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. ఇది తాత్కాలిక మేన‌న్న ఆయ‌న‌.. ఇప్పుడు కాక‌పోతే.. మున్ముందు అయినా కేంద్రాన్ని చంద్ర‌బాబు ఒప్పిస్తార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ప్ర‌తిపాద‌న‌ల‌ను మార్చాల‌ని మాత్ర‌మే తిప్పిపంపించార‌ని.. పూర్తిగా ఈ ప్రాజెక్టును నిలుపుద‌ల చేయాల‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌న్నారు. కాబ‌ట్టి.. బ‌న‌క‌చ‌ర్ల‌పై పోరాటం కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తెలంగాణ నీటి హక్కుల విష‌యంలో అస‌లు ఎలాంటి రాజీ ఉండ‌బోద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌తంలో చేసిన త‌ప్పుల కార‌ణంగా.. రాజ‌కీయంగా రాజీ ప‌డిన కార‌ణంగానే ఇప్పుడు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌న్న ఆయ‌న ఇక‌పై త‌ప్పులు లేకుండా ముందుకు సాగేందుకు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 38 వేల కోట్ల రూపాయ‌ల‌తో ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు అప్ప‌టి సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రాణం పోశార‌ని.. అయితే..కేసీఆర్ వ‌చ్చాక దాన్ని పక్కనపెట్టార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే లంచాల‌కు క‌క్కుర్తి ప‌డి కేసీఆర్‌ కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టారని విమ‌ర్శించారు.