పవన్ పై క్రిమినల్ కేసు… ఎక్కడ? ఎందుకు?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంగళవారం ఓ కేసు నమోదు అయ్యింది. అది కూడా సాదాసీదా కేసు కాదు. ఏకంగా క్రిమినల్ కేసే పవన్ పై నమోదు అయిపోయింది. అదేంటీ?… పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆయనపైనా కేసులు నమోదు అవుతాయా? అన్న రీతిలో జనం.. ప్రత్యేకించి జనసైనికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. ఎందుకంటే.. ఈ కేసు నమోదు అయ్యింది ఏపీలో కాదు. తమిళనాడులో ఈ కేసు నమోదు అయ్యింది.

కేసు వివరాల్లోకి వెళితే…గతనెల మురుగన్ మానాడు పేరిట బీజేపీ నేతలు తమిళనాడులోని మధురైలో భారీ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమ్మేళనానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పవన్ కల్యాణ్ హాజరుకావాల్సి ఉండగా…యోగి డుమ్మా కొట్టగా.. పవన్ మాత్రం నేరుగా మధురై వెళ్లి మురుగన్ సమ్మేళనంలో కీలకోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంలో సూడో లౌకికవాదులు అంటూ పవన్ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ సమ్మేళనాన్ని బీజేపీ తమిళనాడు శాఖ ఆధ్వర్యంలో జరిగింది.

సరే… నాడు ఆ సభ ముగిసింది. పవన్ తిరిగి ఏపీకి చేరుకున్నారు. తన పాలనలో తను బిజీ అయిపోయారు. ఇప్పుడు మంగళవారం తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది వాంజినాథన్ కు పవన్ వ్యాఖ్యలు గుర్తుకు వచ్చినట్టున్నాయి. వెంటనే ఆయన తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పవన్ పై ఫిర్యాదు చేశారు. మురుగన్ భక్తుల సదస్సులో పవన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. వాంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీసులు పవన్ పై ఏకంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో మతం, ప్రాంతం ఆధారంగా పవన్ విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం చేశారని కొన్ని కీలక ఆరోపణలు చేశారు. మరి ఈ కేసు ఏ తీరానికి చేరుతుందో చూడాలి. వాస్తవానికి ఎన్డీఏలో జనసేన కీలక భాగస్వామే. అది కూడా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే… ఆయా రాష్ట్రాల్లో పవన్ కున్న ఫాలోయింగ్ ను వినియోగించుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ముఖ్య కార్యక్రమం ఉన్నా బీజేపీ నేతలు పవన్ నే ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.