వైసీపీ శ్రేణులంతా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మునుపటి మాదిరిగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు కూడా జగనే కారణమని కూడా చెప్పాలి. ఎందుకంటే మొన్నామధ్య త్వరలోనే తన పాదయాత్ర ఉంటుందని, అది గత పాదయాత్ర కంటే కూడా సుదీర్ఘంగా ఉంటుందని స్వయంగా జగనే ప్రకటించారు. అయితే తన పాదయాత్ర ఇప్పుడప్పుడే ఉండదంటూ జగన్ మంగళవారం కుండబద్దలు కొట్టేశారు. దీంతో అప్పటిదాకా హుషారుగా ఉన్న వైసీపీ శ్రేణులు జగన్ తాజా మాటతో ఊసురోమన్నాయి.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడిన జగన్… చివరలో తన పాదయాత్ర, జిల్లా పర్యటనల గురించి కూడా ప్రస్తావించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయన్న జగన్.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. జగన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే…చివరాఖరులో అంటే 2029 ఎన్నికలకు ఏ ఏడాదో, ఏడాదిన్నరో ఉండగా జగన్ తన పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
జగన్ కు జనంలో జనాదరణ అయితే ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఎంత విపక్షంలో ఉన్నా..ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేనంత దీన స్థితిలోకి పార్టీ చేరినా… అసెంబ్లీ గడప తొక్కకపోయినా.. జగన్ కు ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ లెక్కన ఇదే పాలోయింగ్ ఎన్నికల సమయం వరకూ ఉంటుందా? లేదా? అన్న దానిపై ఇప్పుడప్పుడే చెప్పలేమన్న వాదనలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయం సరైనదేనా అన్న దానిపై అప్పుడే పార్టీలో చర్చ మొదలైందని సమాచారం.
వాస్తవానికి 2019లో కూడా జగన్ పాదయాత్ర, అందులో చేసిన నినాదాల కారణంగానే రికార్డు విక్టరీతో పార్టీని గెలిపించుకున్నారు. తానూ సీఎం అయ్యారు. సీఎం కావాలన్న తన జీవిత కలను సాకారం చేసుకున్నారు. ఐదేళ్ల పాటు తనకు ఇష్టమొచ్చినట్గుగా పాలించి ఐధేళ్లకే జనం ఆగ్రహనికి గురయ్యారు. 151 సీట్లతో అత్యంత బలీయంగా ఉన్న వైసీపీ జగన్ పాలన కారణంగా కేవలం 11 సీట్లకు పడిపోయింది. మరి ఈ 11 సీట్లతో ఉన్న పార్టీ జగన్ 2029లో పైకి తీసుకెళతారా? మరింత కిందకు దిగజార్చుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates