వైసీపీ అధినేత జగన్.. తాజాగా వైసీపీ యువ జన విభాగం కార్యకర్తలు, నాయకులతో తాడేపల్లిలోని నివా సంలో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన విభాగం కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రస్తానం నుంచి గత ఏడాది ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను వారితో పంచుకున్నారు. అంతేకాదు.. యువజన విభాగంతో జగన్ భేటీ కావడం కూడా.. గత 7 సంవత్సరాల్లోఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిందని.. అందుకే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. ఈ క్రమంలోనే “అమ్మ(విజయమ్మ) నేను కలిసి పార్టీ పెట్టాం. అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాం. దీనికి కొందరు సాయం చేశారు. మరికొందరు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేసుకున్నారు“ అని జగన్ వివరించారు.
2019లో పార్టీ విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చిందని.. 2014లో తృటిలో అధికారం కోల్పోయిందని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి యువత మరింత కీలకంగా వ్యవహరించాలని జగన్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేయాలని యువతకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. యువత ఇప్పుడు యాక్టివ్ గా ఉంటే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ విషయంలో అందరూ స్పందించాలని కోరారు.
కాగా.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అమ్మ-నేను అంటూ.. జగన్ చేసిన వ్యాఖ్యలపై యువత సైతం విస్మయం వ్యక్తం చేశారు. విజయమ్మ, జగన్‌తోపాటు.. షర్మిల కూడా చమటొడ్చిన విషయం ఎవరూ మరిచి పోలేదు. ఆమెతో ఇప్పుడు రాజకీయంగా వివాదాలు.. ఆస్తుల పరంగా కొట్లాటలు ఉన్నా.. గతంలో పార్టీ కోసంఆమె 3 వేల కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేసిన విషయం జగన్ మరిచిపోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. “అమ్మ-నేను.. షర్మిల కూడా పార్టీ కోసం కష్టపడ్డాం“ అని ఒక్క మాట అని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates