టీడీపీలో అసంతృప్తులను తగ్గించాలని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ, వ్యూహాలపై వ్యూహాలు అమలుచేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో చంద్రబాబు వ్యూహాలు ఫలించడం లేదని అంటున్నారు సీనియర్ నాయకులు. ముఖ్యంగా మాజీ మంత్రి జవహర్ విషయంలో చంద్రబాబు ఆలోచనా విధానాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నేతలు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. తాజాగా జవహర్‌కు వ్యతిరేకంగా లేఖల యుద్ధాన్ని ప్రారంభించారు. దీంతో కొవ్వూరు టీడీపీ రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి.
2014 ఎన్నికలకు ముందు సర్కారీ టీచర్‌గా ఉన్న జవహర్‌ను చంద్రబాబు అనూహ్యంగా రాజకీయ బాట పట్టించారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఆయనను పోటికి పెట్టారు. ఆది నుంచి పార్టీకి పట్టున్న నియోజక వర్గం కావడంతో జవహర్ గెలుపు నల్లేరుపై నడకే అయింది. అయితే, కొవ్వూరు నియోజకవర్గం రిజర్వ్‌డ్ అయినప్పటికీ.. కమ్మ, కాపు సామాజిక వర్గాల టీడీపీ నేతల ఆధిపత్య రాజకీయాలుఎక్కువగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో జవహర్‌పై ఆయా వర్గాల నేతల పెత్తనం పెరిగింది. వీటిని తట్టుకోలేక పోయిన జవహర్.. తనకంటే.. ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఇది మరింతగా ఆయనకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ పెంచింది.
చివరకు జవహర్‌కు టికెట్ ఇవ్వద్దనే ఉద్యమం వరకు ఇది వెళ్లింది. ఈ క్రమంలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణినాయకులు, సీనియర్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు గత ఏడాది ఎన్నికల్లో ఆయనను కృష్నాజిల్లా తిరువూరు నియోజకవర్గానికి బదిలీ చేశారు. అయితే, ఇక్కడ జవహర్ పుంజుకోలేక పోయారు. పైగా.. తనకు కొవ్వూరును కేటాయించాలని ఆయన పలుమార్లు కోరారు. ఈ క్రమంలోనే నెల రోజుల కిందట పార్టీ పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్‌లను నియమించిన సమయంలో రాజమండ్రి ఇంచార్జ్‌గా జవహర్‌కు పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలోనే ఉండడంతో త్వరలోనే జవహర్‌కు మళ్లీ కొవ్వూరు పగ్గాలు ఇచ్చేందుకు బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అయితే, ఈ విషయంపై మరోసారి కొవ్వూరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వద్దన్న నాయకుడిని ఎందుకు మా నెత్తిన రుద్దుతారంటూ.. వారు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఆకాశ రామన్న లేఖలతో చంద్రబాబుకు జవహర్‌పై ఫిర్యాదుల పరంపరను ప్రయోగించారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు మళ్లీ ఆయన మాకెందుకు అంటూ.. ఎస్సీ సామాజిక వర్గాలకు చెంది న వారి పేరుతో ఈ లేఖలు రాయించడం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రబాబు ఈ సారి కూడా సీనియర్ల ఒత్తిళ్లకు తలొగ్గుతారా? లేక.. తాను చెప్పిందే శాసనం అంటారా? చూడాలి.