వైసీపీ నాయకుల కష్టాలు భిన్నంగా ఉన్నాయి. ఒకరు బయటకు వస్తే.. నలుగురు లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. పార్టీ ఐదు వారాల పాటు ఇంటింటికీ ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంబించింది. దీంతో కీలక నాయకులు లేకపోవడంతో నియోజకవర్గాలలో సందడి లేకుండా పోయింది. మరోవైపు..జిల్లాస్థాయి నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో పార్టీ కష్టాలు మామూలుగా లేవన్న మాట వినిపిస్తోంది. తాజాగా మద్యం కేసులో నిధులను వేర్వేరు దేశాలకు మళ్లించేందుకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డికి మరిన్ని కష్టాలు వచ్చాయి.
ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ.. కోర్టు తీర్పు చెప్పింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తో పాటు.. ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడిని కూడా మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ.. విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. వీరిని ఇటీవల అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టు ఆదేశాలతో జైల్లో ఉంచారు. న్యాయవాది సమక్షంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరిని విచారించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మద్యం అక్రమాల నిధులను ఎక్కడెక్కడికి తరలించారన్న అంశంపై పోలీసులు కూపీలాగనున్నారు.
ఇక, మరోవైపు.. మాజీ ఎంపీ.. నందిగం సురేష్‌కు బెయిల్ లభించింది. టీడీపీ కార్యకర్త ఇసుపల్లి రాజు అనే యువకుడిని నిర్బంధించి చితకబాదారన్న కేసులో నందిగం సురేష్ సోదరుడు వెంకట్ సహా మాజీ ఎంపీపై కేసు నమోదైంది. దీంతో గత కొన్నాళ్లుగా సురేష్ జైల్లోనే ఉంటున్నారు. తాజాగా ఆయనకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే… ఆయనకు కొన్ని షరతులు విదించింది. బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాల నిర్వహణ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అదే సమయంలో పోలీసు స్టేషన్‌కు ప్రతి మంగళవారం వెళ్లి సంతకం చేయాలని పేర్కొంది.
ఇదీ.. ప్రభావం..
కీలక నాయకులను కేసులు వెంటాడుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం వైసీపీపై బాగానే పడుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు జగన్ పిలుపునిచ్చినప్పటికీ.. నాయకులు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లు, పార్టీ కోసం తెగించి పనిచేసేవారు.. కేసుల కారణంగా జైళ్లు, బెయిళ్లు..అంటూ తిరుగుతున్నారే తప్ప. జగన్ మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు లేకపోవడంతో వైసీపీ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates