`గేమ్ ఛేంజ‌ర్‌`.. తేడా కొట్టేసింది.. బాబుకు టెస్టే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుగా పేర్కొనే బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో భారీ తేడా కొట్టింది. క‌ర్నూలు జిల్లా బ‌న‌క‌చ‌ర్ల ప్రాంతంలో భారీప్రాజెక్టును నిర్మించ‌డం ద్వారా పోల‌వ‌రం నుంచి నీటిని అక్క‌డ‌కు త‌ర‌లించి.. క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌ప జిల్లాల‌కు సాగు, తాగునీటిని అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌ల‌పోశారు. ఈ ప్రాజెక్టును ఆయ‌న `సీమ‌కు గేమ్ ఛేంజ‌ర్‌`గా కూడా పేర్కొన్నారు. దీనిపై అనేక రూపాల్లో క‌స‌ర‌త్తు కూడా చేశారు. కేంద్రానికి కూడా ప‌లు మార్లు రిప్ర‌జెంటేష‌న్లు ఇచ్చారు. అయితే.. మ‌రోవైపు దీనిని అడ్డుకునేందుకు తెలంగాణ స‌ర్కారు కూడా రెడీ అయిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును సాధించేందుకు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో.. అచ్చంగా అన్నిసార్ల కంటే ఎక్కువ‌గానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వంటివారు హ‌స్తిన చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. ఇలా.. వారు వెళ్లిన ప్ర‌తిసారీ.. బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నాలే చేశారు. ఇక‌, బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత స‌హా ఆ పార్టీ అగ్ర‌నాయ‌కులు హ‌రీష్‌రావు వంటి వారు కూడా బ‌న‌క‌చ‌ర్ల‌పై వ్య‌తిరేక గ‌ళం వినిపించారు. ఇక‌, ఈ విష‌యంపై కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు కోరుకున్నారు.

ఈ నేప‌థ్యంలో కొన్ని రోజుల కింద‌ట కేంద్రానికి ప్ర‌త్యేక నివేదిక కూడా పంపించారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల వ్య‌యం అవుతుంద‌ని.. దీనిని కేంద్రం ఇవ్వాల‌ని.. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొనాల‌ని కూడా చెప్పారు. ఇదేస‌మ‌యంలోతెలంగాణ అభ్యంత‌రాల‌ను కూడా ఆయ‌న తోసిపుచ్చారు. గోదావ‌రి న‌ది నుంచి 3 వేల టీఎంసీల నీరు వృథా అవుతోంద‌ని.. దీనిలోతాము కేవలం 200 టీఎంసీల‌ను మాత్ర‌మే బ‌న‌క‌చ‌ర్ల ద్వారా వాడుకుంటున్న‌ట్టుతెలిపారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. తెలంగాణ‌కు కూడా నిధులు ఇస్తామ‌న్నారు. ఇన్ని జ‌రిగినా.. తెలంగాణ మాత్రం ప‌ట్టు వీడ‌డం లేద‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

తాజాగా ఏంజ‌రిగింది?

తాజాగా ఏం జ‌రిగిందంటే.. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు వ్య‌వ‌హారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జల‌శ‌క్తి శాఖ నిపుణుల‌కు నివేదించింది. దీంతో బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై అధ్య‌యనం చేసిన నిపుణులు.. ఈ ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వ‌రాద‌ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వ‌ద్ద‌ని.. అనేక అభ్యంత‌రాలు వ‌చ్చాయ‌ని.. నిపుణుల క‌మిటీ స్ప‌ష్టం చేసింది. దీనికి అనుమ‌తిస్తే.. తెలంగాణ ప్రాంతం ఎడారిలా మారిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో బ‌న‌క‌చ‌ర్ల‌కు ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌రాద‌ని తేల్చి చెప్పారు. అయితే.. గోదావ‌రి జిల్లాల వివాద ప‌రిష్కార ట్రైబ్యున‌ల్‌కు మాత్రం దీనిని నివేదించ‌వ‌చ్చ‌ని సూచించారు. సో.. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబుకు పెద్ద టెస్టే ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.