ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు? సామాజికవర్గ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తారా? లేక డబ్బులున్న వారికే కట్టబెడతారా? అనే సుదీర్ఘ చర్చలకు తెర దించుతూ .. బీజేపీ అధిష్టానం.. ఏపీ బీజేపీ సారథిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్)కు అవకాశం ఇచ్చింది. అయితే.. యథావిధిగా ఎన్నికల క్రతువు అయితే జరుగుతుంది. కానీ, ఇది లాంఛన ప్రాయమే. ఉత్తరాంధ్రలోని విశాఖకు చెందిన మాధవ్ ఎమ్మెల్సీగా గతంలో పనిచేశారు.
అయితే.. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఆయన పరాజయం పాలయ్యారు. కాగా.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. విధేయతకు, విశ్వసనీయతకు మారు పేరు. విమర్శలకు వివాదాలకు కడు దూరంగా ఉండే మాధవ్ ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతాలు.. హిందూత్వకు పెద్దపీట వేస్తారు. గతంలో తన తండ్రి చలపతిరావు రాజకీయ వారసుడిగా వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు.
అంతేకాదు.. అన్ని పార్టీలనూ కలుపుకొని పోయే నాయకుడిగా కూడా మాధవ్ పేరు తెచ్చుకున్నారు. మంగళవారం నిర్వహించే ఎన్నికలకు పార్టీ అధిష్టానం.. మాధవ్ పేరునే సూచించింది. దీంతో ఆయన నామినే షన్ వేయడంతోపాటు.. ఎన్నిక కూడా లాంఛనమే. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్న నేపథ్యంలో బీజేపీని టీడీపీ-జనసేనతో సమాంతరంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాధవ్‌పైనే ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్… వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న దరిమిలా.. ఆయన అనుభవం కూడా పార్టీని పుంజుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates