సొంత‌ ఎంపీ పై జ‌గ‌న్ ఫైర్‌?

“నీతీరేంది సామీ.. నువ్వే పార్టీలో ఉన్నావ్‌.. ? ఏం చేస్తున్నావ్‌?” ఇదీ.. వైసీపీకి చెందిన ఓ కీల‌క ఎంపీని ఉద్దేశించి.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు. గ‌త ఎన్నికల్లో వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లు ద‌క్కాయి. వీటిలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుప‌తి నుంచి గురుమూర్తి, క‌డ‌ప నుంచి అవినాష్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అర‌కు నుంచి మాత్రం త‌నూజా రాణి తొలిసారి గెలుపు గుర్రం ఎక్కారు. ఈమె మ‌హిళా నాయ‌కురాలు. పైగా తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

అయితే.. తాజాగా త‌నూజా రాణి వ్య‌వ‌హారంపై వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆమె ఓ కీల‌క కూట‌మి పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ‌త ఏడాది అక్టోబ‌రులోనే రాజ‌కీయ పొగ రాజుకుంది. అయితే.. దీనిని అప్ప‌ట్లో వైసీపీ లైట్ తీసుకుంది. కానీ, రానురాను ఆమె పార్టీకి దూరంగా ఉండ‌డంతోపాటు కూట‌మిలోని ఓ కీల‌క పార్టీకి చేరువ‌గా ఉండ‌డంతో పార్టీ నాయ‌కులు ఆమెపై ఫిర్యాదులు చేయ‌డం ప్రారంభించారు. దీంతో జ‌గ‌న్ తాజాగా ఆమెపై సీరియ‌స్ అయిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

కూట‌మి పార్టీల్లో ఉన్న ఓ కీల‌క పార్టీకి త‌నూజా రాణి చేరువ‌గా ఉన్నార‌న్న‌ది కొన్నాళ్లుగా వినిపిస్తున్న‌మాట‌. అయితే.. తొలిసారి ఎంపీ కావ‌డంతోపాటు.. ఆమె వైసీపీ గీత దాట‌ద‌ని అనుకున్నారు. కానీ, గ‌తంలో ఒక మ‌హిళా ఎంపీ కూడా.. ఇలానే చేసిన నేప‌థ్యంలో వైసీపీ అలెర్టు అయింది. అంతేకాదు.. తాజాగా వెలుగు చూసిన స‌మాచారం మేర‌కు.. జ‌గ‌న్‌ను ధ్వేషించే ఓ మాజీ మ‌హిళా ఎంపీనే ఇప్పుడు త‌నూజా రాణిని రాజ‌కీయంగా ఎంగేజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ “నీతీరేంది సామీ..” అంటూ.. త‌న‌దైన ప‌డిక‌ట్టు భాష‌లో ఆమెను ప్ర‌శ్నించార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఇంటింటికీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన త‌ర్వాత కూడా..త‌నూజ ఎక్క‌డ క‌నిపించ‌డం లేద‌ని నాయ‌కుల నుంచి రిపోర్టులు అందాయి. ఈ నేప‌థ్యంలో నువ్వు ఏ పార్టీ ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌? అని జ‌గ‌న్ గ‌ట్టిగానే త‌గులుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.