చంద్ర‌బాబు విశ్వ‌రూపం.. అప్పుడే తెలుస్తుందా ..!

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జోడు ఎద్దుల మాదిరిగా ఈ రెండిటిని ముందుకు నడిపిస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఏడాది పాలన తర్వాత ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయలేదు అనే మాట ఒకవైపు వినిపిస్తున్నా.. మరోవైపు ఏడాదికాలెంలో కొన్ని మైనస్లు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఇది సర్వసాధారణం. ఎవరు దీన్ని కాదనలేదు.

అయితే చంద్రబాబు చెబుతున్న మాట ప్రకారం తొమ్మిది లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెచ్చామని, అనేక కంపెనీలు వస్తున్నాయని భవిష్యత్తు అంతా బాగుంటుందని అంటున్నారు. దీన్ని టిడిపి నాయకులు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చేనెల రెండో తారీకు నుంచి టిడిపి నాయకులు అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించనన్నారు. బాగానే ఉంది. అయితే అసలు చంద్రబాబు విశ్వరూపం ఇప్పుడు కాదు 2029 ఎన్నికలకు ముందు కనిపిస్తుంది అనేది సీనియర్ నాయకుడు ఒకరు చెబుతున్నారు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు చంద్రబాబు వేస్తున్న విత్తనాలు 2027- 28 నాటికి భారీ వృక్షాలు అవుతాయని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే అటు అనంతపురం నుంచి ఇటు విశాఖపట్నం దాకా అనేక కంపెనీలు వస్తున్నాయి. తాజాగా కూడా 80 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. పర్యాటక రంగం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వరకు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటంటే…” వస్తున్నాయి వస్తున్నాయి అంటున్నారు ఇప్పటివరకు ఎవరికీ ఏమీ లబ్ధి చేయ‌లేదు. కదా” అనే.

అది వాస్తవమే. ఒక కంపెనీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే దానికి ఎదిగేందుకు కొంత సమయం పడుతుంది. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభించబోయే అన్ని కంపెనీలు వచ్చే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుని పనులు ప్రారంభిస్తాయి. ఈలోగా సూపర్ సిక్స్ లో అన్ని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. తద్వారా 2027 -28 చివరినాటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కనిపించడంతోపాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందిన యువకులు కనిపిస్తారనేది ఆ సీనియర్ నాయకుడు చెప్పిన మాట.

ఇప్పటికిప్పుడు విత్తనం నాటితే చెట్టు రాదని… చంద్రబాబు చేసింది కూడా అదేనని.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ, ఏ ఐ టెక్నాలజీ లో గాని, డ్రోన్ వ్యవస్థలో గాని, ఐటీ రంగంలో కానీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయని, ఒక్క ఏడాది రెండేళ్లలో ఈ ఫలితాలు అన్నీ ప్రజలు అందుకుంటారని అప్పుడు అసలు విశ్వరూపం కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా వాస్తవమే. ఏ ప్రభుత్వమైనా చేసిన వెంటనే ఫలితం ఇవ్వదు. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు వచ్చే రెండేళ్లలో కచ్చితంగా కనిపిస్తాయి అనేది పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై అనుమానాలు గాని సందేహాలు గానీ అవసరం లేదన్నది వారి మాట.