ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ హాట్ టాపిక్కే!. ఆ నియోజకవర్గంలో అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు ఎన్నికలకు ముందు కన్నా ఎక్కువగా పేలుతున్నాయి. అదే పలాస నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గౌతు శిరీష విజయం దక్కించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గౌత శిరీష గతంలో ఓడిపోయినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి హవాతోపాటు.. ప్రజల్లో ఆమెకు ఉన్న సింపతి, ప్రజల మధ్య ఉండటం, ప్రజల కోసం పనిచేసిన కారణంగా విజయం దక్కించుకున్నారు.
అయితే ఏడాది కాలంగా ఆమె ఎదురీదుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయంగా ఎదురవుతున్న విమర్శలు ఎమ్మెల్యేను ఒకరకంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. వైసీపీ నాయకుడు, మాజీమంత్రి అప్పలరాజు రోజుకో విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఎమ్మెల్యే సహా ఆమె కుటుంబం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక, మద్యం అదేవిధంగా భూములకు సంబంధించి శిరీష భర్త వెంకన్న చౌదరి కేంద్రంగా అప్పలరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు శిరీష వివరణ ఇస్తున్నా.. ప్రజల్లో మాత్రం చర్చ అయితే నడుస్తోంది.
మరోవైపు శిరీషకు మద్దతుగా సొంత పార్టీ నాయకులు ఎవరు స్పందించకపోవడం, ఆమెకు అనుకూలంగా ఎవరు అప్పలరాజుకు కౌంటర్లు ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. వాస్తవానికి టిడిపిలో ఐక్యత ఉంటుంది. ఒక నాయకుడిని ప్రత్యర్థులు ఎవరైనా విమర్శిస్తే ఇతర నాయకులు కూడా స్పందించి కౌంటర్ కామెంట్లు చేస్తారు. తద్వారా పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో ఉంటారు. కానీ పలాసలో మాత్రం శిరీష తరఫున ఎవరు గళం వినిపించకపోవడం గమనార్హం.
దీంతో ఈ నియోజకవర్గంలో రోజు ఏదో ఒక హాట్ టాపిక్ చర్చకు వస్తూనే ఉంది. కొన్ని రోజులు.. సామాజిక వర్గాల ఆధారంగా అప్పలరాజు రాజకీయం చేస్తే.. ఆ తర్వాత వైసిపి నాయకులను కొట్టారంటూ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. అయినా.. ఆయన ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆయన ఎమ్మెల్యేను కార్నర్ గా చేసుకుని చేస్తున్న రాజకీయం మరింత దూకుడుగా ఉందని చెప్పాలి. దీనిని అడ్డుకట్ట వేయడం, నాయకులంతా కలిసి ఉండటం అనేది ఇప్పుడు ప్రధాన అంశం. మరి ఆ దిశగా నాయకులు ముందుకు వెళ్లకపోతే అప్పలరాజు చేస్తున్న రాజకీయమే నిజమనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా శిరీష భర్త వెంకన్న చౌదరి అన్ని విషయాలను జోక్యం చేసుకుంటున్నారని అప్రకటిత ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తున్నారన్నది అప్పలరాజు చేస్తున్న ప్రధాన విమర్శ. దీనిలో ఎంత వాస్తవం ఉందనేది పైకి కనిపించకపోయినా ఏ ఇద్దరు కలిసినా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇది భవిష్యత్తు రాజకీయాలకు మంచిది కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. దీనిని ఎంత తొందరగా ఆమె పరిష్కరించుకుంటే అంత మంచిదనేది పరిశీలకుల భావన.
మరోవైపు శిరీష ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతివారం ప్రజాదర్బారులు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. కానీ ఆ సమస్యల పరిష్కారం ఎంతవరకు ఉందనేది మరో సమస్య. ఈ క్రమంలో అటు ప్రత్యర్థులను కట్టడి చేయడంతో పాటు ఇటు ప్రజల్లో సానుకూలత మరింత పెంచుకునే దిశగా ఆమె అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయంగా వస్తున్న విమర్శలను తట్టుకుని ముందుకు వెళ్లడం కాకుండా వాటిని ప్రతిఘటించడం ద్వారా మాత్రమే ఆమె మళ్ళీ విజయం సాధించగలుగుతారని అభిమానులు సైతం చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates