వైసీపీ హయాంలో మైనింగ్ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆనాడు మైనింగ్ శాఖ ఎండీగా పనిచేసిన అఖిల భారత సర్వీసులకు చెందిన వెంకట రెడ్డిని జైల్లో పెట్టారు. ఇప్పటికీ ఆయన బయటకు రాలేదు. మరోవైపు.. అప్పటి అక్రమాలపై ప్రభుత్వం నియమించిన అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు కనిపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది.
పైకి చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కృష్ణా వంటి కీలక జిల్లాల్లో కొండలు, మట్టి కరిగిపోతున్నాయి. ఇది రాజకీయ పెట్టుబడిగా కూడా మారిపోయింది. తాజాగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అనుచరుడితో ఓ వ్యక్తి రూ.50 లక్షలు లంచం ఇచ్చానంటూ.. చెప్పిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ విషయం అలా ఉంటే.. అసలు మరోవైపు.. నాడు వైసీపీ హయాంలో మైనింగ్ అక్రమాలకు సహకరించిన మధ్య వర్తులు, వ్యాపారులే ఇప్పుడు కూడా జోక్యం చేసుకోవడం గమనార్హం.
అంతేకాదు.. వారే అన్నీ తామై వ్యవహరించడం మరింత చర్చగా మారింది. మైనింగ్ అక్రమాలపై విచారణ చేస్తున్న గనుల అధికారులు ఈ పరిణామంతో అచ్చరువొందుతున్నారు. ఎవరిని పట్టుకుని కేసు పెడుతున్నా.. వెంటనే కీలక నాయకులు లైన్‌లోకి వస్తున్నారు. మా వాళ్లే.. అంటూ వారిపై కేసులు నమోదు కాకుండా చేస్తున్నారు. దీనిపై లోతుగా పరిశీలన చేస్తే.. సదరు వ్యక్తులు.. నాడు వైసీపీ నాయకులకు సహకరించి.. ఎక్కడ ఎలా అక్రమాలు చేయాలో చేయించారు. చేశారు. ఇక, ఇప్పుడు కూడా అదే పంథాలో మధ్య వర్తులు చెలరేగుతున్నారు.
తాజాగా వెలుగుచూసిన గంగాధర నెల్లూరు ఘటనలోనూ.. హైదరాబాద్‌కు చెందిన మీడియేటర్ వ్యవహారం ఇలానే ఉందని తెలిసింది. ఇక్కడే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ హయాంలో చక్రాలు తిప్పిన మధ్యవర్తులే తమ్ముళ్ల చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తుండడంతో కూటమి సర్కారుకు పెద్ద ఇబ్బందిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates