వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్-టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ మధ్య రాజకీయ ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఎక్స్ వేదికగా జగన్ చేసే కామెంట్లకు, విమర్శలకు నారా లోకేష్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ చేసిన విమర్శలపై లోకేష్ స్పందిస్తూ.. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ..“ అని సంచలన వ్యాఖ్య చేశారు. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ మోహన్ రెడ్డి గారు! మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం.“ అని వ్యాఖ్యానించారు.
జగన్ ఏమన్నారంటే..
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థుల ఎంట్రన్స్ పరీక్షలు ముగిసి.. 45 రోజులు అయ్యాయని.. అయినా ఇప్పటి వరకు వీటికి సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించలేదని జగన్ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా మారిందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని విధాలా విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తమ హయాంలో ఎప్పటికప్పుడు విద్యార్థులకు మేలు చేశామని జగన్ పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ పోస్టుపై మంత్రి నారా లోకేష్ అంతే తీవ్రంగా స్పందించారు.
“మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం.“ అని లోకేష్ చురకలు అంటించారు. “మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేసాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము. మా ప్రభుత్వంపై మీ ఏడుపులు మాకు దీవెనలు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates