మీడియాకు ఈ రేంజి వార్నింగ్ ఇదే తొలిసారి!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహాన్యూస్ టీవీ ఛానెల్ కార్యాలయంపై శనివారం విపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తీవ్రత ఏ రేంజిలో ఉందంటే… దాడి జరిగిన మరుక్షణమే సదరు కార్యాలయాన్ని మహాన్యూస్ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపగా… దానిని మించి ఆదివారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దారుణంగా ఉన్నాయని చెప్పాలి. అసలు మీడియాకు ఈ రేంజి వార్నింగ్ ఇప్పటిదాకా వచ్చిన దాఖలానే లేదని కూడా చెప్పాలి.

ఆదివారం మహాన్యూస్ పై జరిగిన దాడి గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చిన జగదీశ్ రెడ్డి..మహాన్యూస్ ఆఫీస్ పై జరిగిన దాడి బీఆర్ఎస్ చేసిందేనని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ మాత్రం దానినే దాడి అనుకుంటే ఎలాగని ప్రశ్నించిన ఆయన అది కేవలం నిరసన మాత్రమేనని సంచలన వ్యాఖ్య చేశారు. మహాన్యూస్ ఛానెల్ మాదిరే రాష్ట్రంలో ఇంకో రెండు, మూడు సంస్థలు ఉన్నాయని చెప్పిన జగదీశ్..వాటి పని కూడా పడతామని చెప్పారు. వాటిపై జరిగే దాడులు మామూలుగా ఉండవని కూడా ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని జగదీశ్ రెడ్డి…తమ పార్టీ అధినేత కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను తాము మాత్రం వదిలిపెట్టేది లేదని ఆయన మరింత తీవ్రమైన వ్యాఖ్య చేశారు. తాము టార్గెట్ చేసిన మీడియా సంస్థలను ఏ పోలీసు కూడా కాపాడలేరని ఆయన హెచ్చరించారు. ఇక ఆ తర్వాత నేరుగానే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి… “మీ బలుపు ఏంది? మీ అహంకారం ఏంది? ఎవడ్ని చూసుకుని మీకు ఈ బలుపు? ఎన్ని జరిగినా దాడి అయితే మొదలుపెట్టం అని మాత్రం అనుకోకండి. ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరి తిండి తింటున్నారు. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది” అని ఆయన తనదైన శైలి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

కొందరు వ్యక్తులు తెలంగాణలో మీడియా హౌస్ ల పేరిట కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని, అందుకోసం స్లాటర్ హౌస్ లు నడుపుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ మా మీడియా మా ఇష్టం వచ్చినట్లు రాస్తాం అంటే మాత్రం ఇకపై తెలంగాణలో కుదరదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇలా చేస్తే ఎవడు ఊరుకుంటాడు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణను వీడదీశారన్న కోపంతోనే ఈ రాతలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏడాదిగా ఆయా మీడియా ఛానెళ్ల చెంచాగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్న జగదీశ్ రెడ్డి… ఆ స్లాటర్ హౌస్ లను మాత్రం వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.