దేశమంతా దీపావళి ఉత్సవాలు జరుపుకుంటుంటే దాయాది దేశం పాకిస్ధాన్ భారత్ ను సరిహద్దుల్లో దొంగదెబ్బ తీసింది. అయతే పాకిస్దాన్ దొంగదెబ్బను పసిగట్టిన మన సైన్యం వెంటనే తేరుకుని చావుదెబ్బ కొట్టింది. మన సైన్యం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.45-2.45 మధ్య భారత్-పాకిస్ధాన్ సరిహద్దుల్లోని దేవార్, కేరన్, ఊరి, నౌగమ్ ప్రాంతాల్లో పాకిస్ధాన్ హఠాత్తుగా దొంగదెబ్బ మొదలుపెట్టింది. సరిహద్దుల్లో కాపలాగ ఉన్న మన సైన్యంపై ఒక్కసారిగా కాల్పులకు దిగింది. పై ప్రాంతాల్లో గ్రామాలుండటంతో పాకిస్ధాన్ కాల్పులకు మామూలు జనాలు కూడా బలయ్యారు.
పాక్ కాల్పుల్లో నలుగురు సైనికులు, బిఎస్ఎఫ్ దళంలోని ఓ ఎసైతో పాటు ఎనిమిది మంది మామూలు జనాలు కూడా తమ ప్రాణాలను కోల్పోయారు. పాకిస్ధాన్ నుండి కాల్పులను ఏమాత్రం ఊహించని వీళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లు సైన్యం తెలిపింది. అయితే పాకిస్ధాన్ కాల్పులకు తెగబడిన విషయాన్ని గ్రహించిన మన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. మోర్టార్లు, ఇతర ఆయుధాలతో పాకిస్ధాన్ ఉద్దేశ్యపూర్వకంగానే మన సైన్యం, పౌరులపై కాల్పులు జరుపుతోందన్న విషయం అర్ధమైపోయింది. దాంతో వెంటనే భారత్ సైన్యం కూడా దాయాదికి సరైన బదలిచ్చింది.
పాకిస్ధాన్ పన్నాగం అర్ధమవ్వగానే అప్రమత్తమైన భారత్ దళాలు ఎదురుదాడి మొదలుపెట్టింది. దాయాది సైన్యంపై మిస్సైల్స్, ట్యాంకర్లు, రాకెట్లతో ఎదురుదాడులకు దిగింది. శతృదేశపు సైన్యం శిబిరాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా ప్రయోగించిన మిస్సైళ్ళు, ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణుల ప్రయోగం ఫెయిల్ కాలేదు. మన సైన్యం ప్రయోగించిన అన్నీ ఆయుధాలు శతృవుల బంకర్లను, శిబిరాలను ధ్వంసం చేసేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పర్వాల్లో నిర్మించుకున్న బంకర్లను కూడా మన సైన్యం ధ్వంసం చేసేసింది. శతృవల బంకర్లు, శిబిరాలు ధ్వసం అయిపోతున్న వీడియోలను మన సైన్యం విడుదల చేసింది.
మన సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్ధాన్ సైనికులు చనిపోవటమే కాకుండా ఆయుధ డిపోలు, ఉగ్రవాదుల శిబిరాలు కూడా నేటమట్టమయ్యాయి. మన సైన్యం జరిపిన ఎదురు దాడుల్లో 2 పాకిస్ధాన్ సైనిక కమేండోలతో పాటు 8 మంది సైనికులు మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గడచిన వారం రోజుల్లో పాకిస్ధాన్ చేసిన రెండో చొరబాటు ప్రయత్నిమిది అంటు సైన్యం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్ధాన్ ఉల్లంఘించి 4052 సార్లు కాల్పులకు తెగబడింది. మొత్తానికి ఒకవైపు డ్రాగన్ దేశం ఇంకోవైపు దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించటం, ఏకపక్షంగా కవ్వింపు చర్యలతో కాల్పులకు తెగబడటానికి ఎప్పుడు స్వస్తి పలుకుతాయో ఏమో.