కొండా వారి క‌ళ్లు తెరుచుకున్నాయా?

కొండా ముర‌ళి.. రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కుడు. మంత్రి సురేఖ భ‌ర్త‌. గ‌తంలో కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయ‌న‌..త‌ర్వాత వ‌రుస గా పార్టీలు మారుతూ వ‌చ్చారు. అయితే.. ఏ పార్టీలో ఉన్నా ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు ఆయ‌న కేరాఫ్ అనే మాట ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా నాయ‌కుల‌కు తెలియంది కాదు. వైసీపీ, బీఆర్ ఎస్ పార్టీల‌లోనూ కొండా ఫ్యామిలీ ఇలానే చేసింది. ఇక‌, ఇప్పుడు కూడా అవే ప‌రిస్థితులు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో అధిష్టానం సీరియ‌స్‌గానే రియాక్ట్ అయింది. పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే ప‌రిస్థితు లు తెచ్చుకోవ‌ద్ద‌ని సుతిమెత్త‌గా మ‌ల్లు ర‌వి హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది.

దీంతో తానే పార్టీకి వెన్నుద‌న్ను అని.. జిల్లాలోను, మండ‌ల‌స్థాయిలో త‌న రాజ‌కీయాల‌కు అడ్డు లేద‌ని చెప్పుకొచ్చిన కొండా ముర‌ళి.. ఎట్ట‌కేల‌కు దిగివ‌చ్చారు. తాను త‌ప్పు తెలుసుకున్నాన‌ని.. అంద‌రినీ క‌లుపుకొని పోతాన‌ని వ్యాఖ్యానించారు. పార్టీలో అంద‌రినీ స‌మానంగానే చూస్తున్నాన‌ని ఆయ‌న వివ‌రణ ఇచ్చారు. అయితే.. ఇది ప్రాధ‌మికంగానే చూడాలి. గ‌తంలోనూ బీఆర్ ఎస్‌లో ఇలానే వివాదం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టి కేసీఆర్‌కు కూడా ఇలానే వివ‌ర‌ణ ఇచ్చుకునే ప‌రిస్థితి తెచ్చుకున్నా రు. ఈ క్ర‌మంలోనే అధిష్టానం తాజాగా ఆయ‌న‌పై సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఇరుగు పొరుగు పార్టీల నుంచి వ‌చ్చే చేరిక‌ల‌ను ఆహ్వానించాల‌న్న‌ది కాంగ్రెస్ పెట్టుకున్న ల‌క్ష్యం. అయితే.. ఇలా వ‌చ్చిన వారితో క‌లిసిమెలిసి మెల‌గాల్సిన కొండా.. త‌న దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం.. త‌న‌కు తిరుగులేద‌ని.. తాను ఫండింగ్ చేయ‌క‌పోతే.. రేపు స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రిస్థితి ఏంట‌ని? ప్ర‌శ్నించ‌డం ద్వారా రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. అయితే.. తాజా హెచ్చ‌రిక‌లు, వార్నింగుల‌తో ఆయ‌న లైన్‌లోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో క‌డియం శ్రీహ‌రి వంటి కీల‌క నాయ‌కుల‌ను ఏమేర‌కు క‌లుపుకొని పోతార‌న్న‌ది ప్ర‌శ్న‌గానే ఉంది. బ‌ల‌మైన ఎస్సీ సామాజిక వ‌ర్గంలో క‌డియంకు ప‌ట్టుంది. అలాంటి నాయ‌కుడినే కొండా వ‌ర్గం టార్గెట్ చేసుకుంది. సో.. ఈ స‌మ‌స్య ఇప్ప‌టితో ఆగుతుందా? లేక కొన‌సాగుతుందా? అనేది చూడాలి.