వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక పార్టీ నుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఆయన రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? ఇది ఇప్పుడు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే జిల్లాకి ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఒకవైపు పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని అధినేత చెప్తున్నారు. సరే ఎన్నికల తర్వాత, ఎన్నికల సమయంలోను ఆయన చేసిన తప్పుల వల్ల కొన్ని కేసులు నమోదయ్యి జైలుకి వెళ్లారు. బయటకు వచ్చారు.
కానీ యాక్టివ్గా మాత్రం ఉండడం లేదు. నాయకులను కలుసుకోవడం లేదు. కార్యకర్తల మధ్యకు రావడం లేదు. పార్టీ జెండా పట్టుకోవడం లేదు. పార్టీ తరపున వాయిస్ వినిపించడం లేదు. ఈ కీలక కారణాలవల్ల ప్రస్తుతం పల్నాడులో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో వైసిపి నాయకులు గాని, వైసీపీ కార్యకర్తలు గాని బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు జగన్ మాత్రం అందరూ ప్రజలను కలవాలని, ఇంటింటికి వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేక ప్రచారం, కార్యక్రమాలు చేపట్టాలని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం అసలు ఎక్కడా కనిపించడం లేదు.
పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. దీంతో ఆయన్ను పార్టీలోనే కొనసాగించినా.. కీలకమైన పదవి నుంచి తప్పిస్తారనేది సీనియర్ నాయకులు చెబుతున్న మాట. ఆయనను పార్టీ నుంచి తప్పించాలని పార్టీ అధినేతకు లేదని, కానీ పార్టీ ప్రస్తుతానికి పుంజుకునే విధంగా అధ్యక్ష పగ్గాలను వేరే వారికి అప్పగించే అవకాశం ఉందని మాత్రం అంటున్నారు. అయితే దీనికి పిన్నెల్లి అంగీకరిస్తారా లేదా అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే అధ్యక్ష పదవి నుంచి గనుక తప్పిస్తే ఆయన ద్వితీయ శ్రేణి నాయకుడు అవుతాడు. లేదా మాజీ ఎమ్మెల్యే గానే ఉండిపోవాల్సి వస్తుంది.
కాబట్టి తన హవా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగని ప్రజల్లోకి వచ్చి పని చేద్దామంటే చుట్టుముట్టిన కేసులు ఆయన్ను ఇబ్బంది పడుతున్నాయి. ఎలా చూసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయం మాత్రం ప్రస్తుతం ఇబ్బందికర పరిస్తితిలోనే కొనసాగుతోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. పార్టీ అయితే సీరియస్ గానే ఉంది. అందరూ బయటికి రావాలని కేసులకు భయపడవద్దని జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి పల్నాడులో ఏం జరుగుతుంది? ముఖ్యంగా మాచర్లలో ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates