2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇక మళ్లీ వైసీపీనే వస్తోందని ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఊదరగొట్టారు. అదే సమయంలో మూడు పార్టీలు కలిసి కట్ట కట్టుకుని వచ్చాయని అయినా ఫలితం ఉండబోదని కూడా పరాచికాలు ఆడాయి. ఈ లెక్కన వైసీపీ దృష్టిలో కూటమి దయనీయ స్థితిలో ఉన్నట్టే. అదే సమయంలో ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కు పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంది. ఏ క్షణాన ప్రైవేట్ పరం అవుతుందోనని ఆందోళనలు నెలకొన్నాయి.
అయితే వైసీపీ అంచనాలు.. ఆ పార్టీ గెలవాలని కోరుకున్న వారి ఊహలు పటాపంచలు అయ్యాయి. 2019లో వైసీపీ 151 సీట్లు గెలిస్తే… 2024లో కూటమి ఏకంగా 164 సీట్లను గెలిచి వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసింది. వెరసి దయనీయ స్థితిలో ఉందనుకున్న కూటమి కోటి దివ్వెల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతే… చిచ్చుబుడ్డిలా వైసీపీ అలా పేలి ఇలా మాయమైపోయింది. విశాఖ ఉక్కును కూటమి సర్కారు ప్రైవేటు పరం అనే వ్యవహారం నుంచి బయట పడేసింది. కేంద్రం నుంచి ఏకంగా రూ.13 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని విశాఖ ఉక్కుకు సాదించి పెట్టింది.
ఇదంతా జరిగి ఏడాది అవుతోంది కదా. ఇప్పుడు కూటమి మాదిరే విశాఖ ఉక్కు కూడా ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. వాస్తవంగా విశాఖ ఉక్కులో మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లను కొత్తగా ఏర్పాటు చేశారు. వాటిలో ఇప్పటిదాకా రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు కేవలం 14 టన్నుల హాట్ మెటల్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ మేర ఐరన్ ఉత్పత్తితో విశాఖ ఉక్కు మనుగడ కష్టమే. ఇప్పటికే ఉన్న నష్టాలు మరింతగా పెరిగిపోవడం ఖాయం. దీంతో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా పనిచేసేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది.
ఫలితంగా ఎలాగైనా వీలయినంత త్వరగా మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను పనిచేసేలా చూడాలని యంత్రాంగం తీవ్రంగా కృషి చేసింది. ఈ కృషి కూడా అనుకున్న సమయం కంటే కాస్తంత ముందుగానే మంచి ఫలితాన్ని ఇచ్చింది. మూడో బ్లాస్ ఫర్నేస్ ను ప్రారంబించేందుకు రంగం సిద్ధం అయ్యిందన్న సమాచారం తెలుసుకున్న విశాఖ స్టీల్ ఇంచార్జీ చైర్మన్ దయా నిదాన్ పాండే శుక్రవారం మూడో బ్లాస్ట్ ఫర్నేస్ లాంఛనంగా ప్రారంబించారు. మూడోదీ అందుబాటులోకి రావడంతో ఇకపై రోజుకు 21,000 టన్నుల ఐరన్ ఉత్పత్తి కానుంది. దీంతో ఉన్న నష్టాలను అనతి కాలంలోనే పూడ్చేసుకునే విశాఖ ఉక్కు అతి త్వరలోనే లాభాల్లోకి రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates