వార్నింగుల బాబు… సీబీఎన్‌లో కొత్త కోణం!

ఏపీ సీఎం చంద్ర‌బాబులో కొత్త కోణం క‌నిపిస్తోందా? వార్నింగుల బాబుగా సీబీఎన్ మారుతున్నారా? అంటే.. వ‌రుస‌గా ఆయ‌న విరుచుకుప‌డుతున్న తీరు.. ఇస్తున్న వార్నింగులు.. చూస్తున్నవారు ఔన‌నే అంటున్నారు. గురువారం, శుక్ర‌వారం రెండు రోజులు కూడా సీఎం చంద్ర‌బాబు నోటి నుంచి వార్నింగులే వ‌చ్చాయి. గురువారం అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ నిరోధ‌క దినోత్స‌వం కావ‌డంతో గంజాయి ఉత్ప‌త్తిదారుల‌కు, వినియోగదారుల‌కు, విక్ర‌య‌దారుల‌కు కూడా చంద్ర‌బాబు గ‌ట్టివార్నింగే ఇచ్చారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న వారిని కూడా వ‌దిలి పెట్టేది లేద‌న్నారు.

ఇక, డ్ర‌గ్స్ వినియోగిస్తే.. జైలుకేన‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. మ‌రీముఖ్యంగా గంజాయి ర‌వాణాపై ఉక్కుపాదం మొపుతున్నా మ‌న్న చంద్ర‌బాబు ఈగ‌ల్ టీం అన్ని ప్రాంతాల్లోనూ నిఘా పెట్టింద‌ని హెచ్చ‌రించారు. ఇక‌, రాజ‌కీయ ముసుగులో గంజాయి బ్యాచ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవారి తాట తీస్తామ‌ని చెప్పారు. అంటే.. ప‌రోక్షంగా వైసీపీ నాయ‌కుల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. ఇక‌, శుక్ర‌వారం మ‌రింత‌గా చంద్ర‌బాబు దూకుడు పెంచారు. రాష్ట్రంలో అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ క్ర‌మంలో నేరాల నియంత్ర‌ణ‌కు అంత‌క‌న్నా ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు.

రాష్ట్రంలో నేరాలు చేసేవారు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. విద్యాసంస్థ‌ల నుంచి ఆఫీసుల వ‌ర‌కు.. నేరాల‌కు తెగ‌బ‌డాలంటే వ‌ణుకు పుట్టించే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. నిరంత‌రం పోలీసుల నిఘా పెడుతున్నామ‌న్న చంద్ర‌బాబు.. రాష్ట్రం రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతున్న‌ట్టు చెప్పారు. రౌడీలు ఒక‌ప్పుడు అంద‌రికీ తెలిసేవార‌ని.. కానీ.. ఇప్ప‌డు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసి.. ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఇలాంటి వారిని న‌డిరోడ్డుపై శిక్షించేందుకు కూడా వెనుకాడ‌బోమ‌న్నారు. ఫ్యాక్ష‌న్‌క‌క్ష‌ల‌ను కూడా అంత‌మొందించామ‌న్నారు. ఇక‌పై రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా శాంతి సుమాలు విల‌సిల్లాల్సిందేన‌ని చెప్పారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. వ‌రుస‌గా చంద్ర‌బాబు రెండురోజుల పాటు చేసిన హెచ్చ‌రిక‌లు గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబులో కొత్త కోణం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. ముఖ్యంగా చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు.. వైసీపీని అడ్డు పెట్టుకుని కొంద‌రు చేస్తున్న దురాగ‌తాలేన‌ని అంటున్నారు.