అన్నింటా పెట్టుబ‌డులే.. ఏపీపై మొగ్గెందుకు?

ఏపీలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా.. దాదాపు అన్ని రంగాల్లోనూ పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లే కాకుండా.. ఐటీ రంగ దిగ్గ‌జ కంపెనీలు కూడా వ‌స్తున్నాయి. 500 కోట్ల నుంచి వేల కోట్ల వ‌ర‌కు కూడా కంపెనీలు ఏపీకి క్యూ క‌డుతున్నాయి. ప్ర‌భుత్వం కోరుతున్న కంపెనీలే కాకుండా.. కూట‌మి పాల‌న‌ను చూసి.. పెట్టుబ‌డులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గ‌మ‌నించి చాలా కంపెనీలు ఏపీపై మ‌క్కువ చూపుతున్నాయి.

కూల్ డ్రింక్స్ నుంచి ఇనుము ఉత్ప‌త్తుల‌ వ‌ర‌కు.. ప‌ర్యాట‌క రంగం నుంచి విద్యా రంగం దాకా… గ‌త నాలుగు మాసాల్లో ల‌క్ష కోట్ల‌కు పైగానే పెట్టుబ‌డులు వ‌చ్చాయి. దీనికి ముందు వివిధ రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌సిద్ధ కంపెనీలు కూడా వ‌చ్చాయి. వీటిని కూడా క‌లుపుకొంటే.. ప్ర‌స్తుతం 11 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పెట్టుబ‌డులు ఏపీకి ద‌క్కాయి. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల కోట్ల పెట్టుబ‌డులు రాగా.. ఈ ఏడాది చివ‌రినాటికి పూర్తిస్థాయిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సంస్థ‌లు రానున్నాయి.

ఆయా సంస్థ‌ల‌కు ఇప్ప‌టికే భూములు కూడా కేటాయించారు. మ‌రికొన్నింటికి భూముల‌ను ప‌రిశీలిస్తున్నా రు. ఇక‌, అనుమ‌తుల విష‌యానికి వ‌స్తే.. ఎప్ప‌టిక‌ప్పుడు వేగ‌వంతంగా అనుమ‌తులు ఇచ్చేలా కేబినెట్ తాజాగా నిర్ణ‌యించింది. ఏ రంగానికి చెందిన శాఖ ఆ రంగానికి సంబంధించిన పెట్టుబ‌డుల‌కు అనుమ‌తులు వేగంగా ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలోనూ అలానే జ‌రుగుతోంది. వీటిని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా.. హార్స్‌లీహిల్స్‌(క‌డ‌ప‌లో)పై త‌న ఆశ్ర‌మాన్ని ప్రారంభించ‌డంతో పాటు.. ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసేందుకు స‌ర్కారుతో రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా పెట్టుబ‌డులు రావ‌డానికి కార‌ణ‌మేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌భుత్వంపై ఉన్న న‌మ్మ‌కంతోపాటు.. తీసుకునే నిర్ణ‌యాల్లో నిర్మాణాత్మ‌క వైఖ‌రి కూడా క‌నిపించ‌డ‌మే కార‌ణ‌మ‌ని.. దూర‌దృష్టి ఉన్న ముఖ్య‌మంత్రి ఉండ‌డమేన‌ని పెట్టుబ‌డి దారులు చెబుతున్నారు.