“జరిగింది సీరియస్ ఘటన. ప్రాథమిక ఆధారాలను బట్టి కేసు క్వాష్ చేయలేం. మంగళవారం నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు ఏం జరిగిందో పూర్తిగా వింటాం.” అని వైసీపీ అధినేత జగన్ సహా వైసీపీ మాజీ మంత్రులు విడదల రజనీ, పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై హైకోర్టు స్పష్టం చేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. అయితే.. అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
ఏం జరిగింది?
ఈ నెల 18న జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తల తోపులాటలో సింగయ్య అనే కార్యకర్త జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో డ్రైవర్ రమణారెడ్డి(ఈయనను ప్రభుత్వమే నియమించింది.)ని ఏ1గా, మాజీ సీఎం జగన్ ను ఏ2గా పేర్కొన్నారు. ఇక, కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులు విడదల రజనీ, పేర్నినానీలపైనా కేసులు పెట్టారు.
ఈ క్రమంలో అసలు తమకు ఈ కేసుకు సంబంధం లేదని తొలుత విడదల రజనీ, పేర్ని నాని కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత.. ఏ2గా ఉన్న జగన్ కూడా.. తనపై రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని పేర్కొం టూ.. కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఆయా పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దీనినిలోతుగా దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసుల తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుని క్వాష్ చేయలేమని, వీటిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే.. అప్పటి వరకు విచారణ, అరెస్టులు చేయరాదని పోలీసులకు తేల్చి చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates