జగన్ 2.0 అంటూ.. ప్రజల మధ్యకు వచ్చేందుకు వైసీపీ నాయకులు రెడీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్.. జగన్ సోదరి షర్మిల సీరియస్ కామెంట్లు చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. మద్యం మాఫియా నడిపించారని.. దాచిన సొమ్ము.. దోచిన సొమ్మును కక్కించాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జగన్ పాలనలో రైతులకు కూడా ఎలాంటి సుఖం లేదన్న షర్మిల.. ఇప్పుడు మాత్రం అన్నదాతలకు ఏదో జరిగిపోతోందని రోడ్డెక్కుతున్నారు… బల ప్రదర్శన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
“రైతులను నట్టేట ముంచారు. రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. దివంగత వైఎస్ చేపట్టిన జలయజ్ఞం పనులు కూడా చేయలేదు. ఆరు మాసాల్లోనే మొత్తం పెండింగు ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఒక్క దానిని కూడా పూర్తి చేయాలేదు. ఇప్పుడు 2.0 అంటూ ఏమొహం పెట్టుకుని వస్తాడు” అని షర్మిల నిలదీశారు.
అంతేకాదు.. కనీసం గత ఐదేళ్లలో ప్రజల ఇబ్బందులు కనుక్కోలేదన్న ఆమె.. దీనికి సమాధానం చెప్పాలన్నారు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేడని అన్నారు. ఇప్పుడు 2.0 అని ఏ మొహం పెట్టు కుని ప్రజల మధ్యకు వస్తాడు? ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు? అని నిప్పులు చెరిగారు.
“జగన్ కి ప్రజా సమస్యలు కాదు.. కావలసినవి బలప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన బలప్రదర్శనలకు ముగ్గురు బలి అయ్యారన్న షర్మిల.. జగన్ పర్యటనలకు, ప్రదర్శనలకు.. పోలీసులు, ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. జగన్ 2.0 ప్రదర్శనలను అడ్డుకోవాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates