టాప్ పోస్ట్ పై జగ్గారెడ్డికీ కోరికుందట!

తూర్పు జయప్రకాశ్ రెడ్డి అంటే పెద్దగా ఎవరికీ తెలియదేమో గానీ… జగ్గారెడ్డి అంటే మాత్రం అందరి కళ్ల ముందు తెల్ల గడ్డం రెట్టి ఇట్టే ప్రత్యక్షమైపోతారు. మనసులో ఏముందో దానిని దాచుకుని అవసరం వచ్చినప్పుడు, సమయం, సందర్భం చూసుకుని దానిని బయటపెట్టడంలో ఈయనకు అస్సలు చేత కాదు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తన మనసులో ఏముందో దానిని బయటపెట్టేస్తూ అభాసుపాలు అవుతూ ఉంటారు. సంగారెడ్ది జిల్లా కేంద్రానికి చెందిన జగ్గారెడ్డి.. తనకూ ముఖ్యమంత్రి పదవి మీద ఆశ ఉందని సంచలన వ్యాఖ్య చేశారు.

ఇంతకూ జగ్గారెడ్డి ఏమన్నారంటే… “రేవంత్ రెడ్డి ఈ మూడున్నరేళ్లు సీఎంగా కొనసాగుతారు. ఆ తర్వాత ఐధేళ్ల పాటు కూడా సీఎంగా కొనసాగేందుకు రేవంత్ ప్రయత్నిస్తారు. అంటే మొత్తంగా ఎనిమిదిన్నర, తొమ్మిదేళ్ల పాటు సీఎంగా రేవంతే కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత అంటే… తొమ్మిదేళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తాను” అంటూ జగ్గారెడ్డి అన్నారు. సరే… ఇలా తన మనసులోని మాటను ఇలా సమయం సందర్భంగా లేకుండా బయటపెట్టినా జగ్గారెడ్డికి ఈ దఫా పెద్ద ఇబ్బందేమీ కలగలేదనే చెప్పాలి. ఎందుకంటే… రేవంత్ ను దించేసి తాను సీఎం అవుతానని జగ్గారెడ్డి అనలేదు కదా. అంతేకాకుండా మరో ఐధేళ్లు కూడా ఆయన రేవంత్ దే అవకాశం అని కూడా వ్యాఖ్యానించారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా… కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ. వి.హన్మంతరావు నుంచి అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ వరకు వృద్ధుల నుంచి కుర్రాళ్ల దాకా అన్ని వయసుల వారూ పార్టీలో పదవులు ఆశిస్తూ ఉంటారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుందూరు జానారెడ్డి లాంటి హేమాహేమీలను దాటుకుని జగ్గారెడ్డి టాప్ పోస్టును చేజిక్కించుకోవడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్ కు కొత్త ఊపిరి ఊదిన రేవంత్ విషయంలోనూ సీఎం పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం చాలా రోజుల పాటు వేచి చూసింది. అయితే రేవంత్ కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా కష్టమేనన్న అంచనాకు వచ్చిన రాహుల్ గాంధీ.. రేవంత్ కే ఓటేశారు.

సంగారెడ్డి అసెంబ్లీ నుంచి 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి.. 2009లోనూ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోగా… తిరిగి 2018 ఎన్నికల్లో మరోమారు గెలిచారు. ఇక 2023 ఎన్నికల్లోనూ ఆయన టికెట్ సాధించినా…ఎందుకనో గానీ వరుసగా రెండో సారి కూడా ఆయన ఓడిపోయారు. అయితే అంతకుముందే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేజిక్కించుకున్న జగ్గారెడ్డి… పార్టీ తరఫున తన వాయిస్ ను బలంగానే వినిపిస్తున్నారు. ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న జగ్గారెడ్డి… మరో తొమ్మిదేళ్ల తర్వాత సీఎం పదవి కోసం ప్రయత్నం చేయడంలో ఎలాంటి ఇబ్బందే లేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.