రాజకీయాల్లో జంపింగులు షరా మామూలే! ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా.. కండువా కప్పేయడం పార్టీలకు ఆనవాయితీగా మారిపోయింది. ఎంత మంది నేతలను గుంజేసుకుంటే.. అంత మంచిదనే ధోరణి అన్ని పార్టీల్లోనూ వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములతోనూ సంబంధం లేదు. బలాబలాలతోనూ సంబంధం లేదు. నాయకుడు వస్తానంటే.. చేర్చేసుకోవడమే అన్న ధోరణి అన్ని పార్టీల్లోనూ ఉంది. అయితే, దీనికి భిన్నంగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఎంచుకున్న పార్టీల నుంచి మాత్రమే నాయకులను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
దీనికి కొన్ని కారణాలు చెబుతున్నారు బీజేపీ నేతలు. ఇటీవల విజయనగరం జిల్లాలో టీడీపీ కురువృద్ధు డు.. గద్దె బాబూరావును బీజేపీ నేతలు పార్టీలోకి చేర్చుకున్నారు. ఇంకా వస్తే.. ఎంతమందికైనా బీజేపీలో చోటుందని ఏపీ పార్టీ చీఫ్.. సోము వీర్రాజు ప్రకటించారు. అయితే, కేవలం టీడీపీ నేతలపైనే కన్నేసినట్టు ఆయన బాహాటంగానే చెప్పడం ఇక్కడ విశేషం. అదేంటి? అని ఆరా తీస్తే.. చిత్రమైన విషయాలు వెలుగు చూశాయి. టీడీపీ నేతలపై ప్రజల్లో ఇప్పుడు సానుభూతి ఉందని.. ఇది తమకు వరంగా మారుతుందని బీజేపీ భావిస్తోందట. అంతేకాదు.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడింది.. నేతల వల్లకాదు.. చంద్రబాబు అనుసరించిన ప్రజావ్యతిరేక వైఖరివల్లే అనేది సోము ఉవాచ!
దీంతో టీడీపీ నేతలను ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నామని.. ఇప్పటికే పంచాయితీ పరిధిలో నేతలను కూడా తమ పార్టీలోకి చేర్చుకునేందుకు రెడీ అయ్యామని చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీ నుంచి మాత్రం నేతలను తీసుకునే విషయంలో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు వైసీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని.. ప్రజల్లో వారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇలాంటి వారిని తీసుకుంటే.. ఇబ్బందని సోము చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. పైకి సోము ఇలా చెబుతున్నా.. లోపాయికారీగా.. వైసీపీ-బీజేపీలు కూడబలుక్కుని.. టీడీపీని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. రాజకీయాల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో!!