‘ఆ గ్యాప్’ గుర్తించ‌డంలో బాబును బీట్ చేయ‌లేక‌పోతున్న జ‌గ‌న్‌.. !

జనం నాడి పట్టుకోలేకపోతున్నారా? ఇప్పటికిప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు అనేది జగన్ గ్రహించలేకపోతున్నారా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంటింటికి చంద్రబాబు మేనిఫెస్టో తీసుకెళ్తామని ప్రజల్లో తిరుగుబాటు తీసుకొస్తామని జగన్ చెప్తున్నారు. కానీ వాస్తవానికి ప్రజల నాడి పథకాల మీద ఉందా లేకపోతే అభివృద్ధిపై ఉందా అనేది జగన్ ముందు తెలుసుకోవాల్సిన విషయం. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని అనుకుంటే.. వీరిలో అప్పుడు జగన్ గానీ ఇప్పుడు చంద్రబాబు గాని ఇస్తున్న పథకాలను తీసుకుంటున్న వారు లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య కేవలం కోటి కుటుంబాల లోపే ఉంది.

పింఛన్లు అందుకుంటున్న వాళ్ళు 67 లక్షల మంది. తల్లికి వందనం లేదా అమ్మఒడి తీసుకుంటున్న వారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంది. అంతకుమించి మారడం లేదు. ఇతర పథకాల విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల పరంగా చూసుకున్న లక్షల్లోనే ఉంది. అంటే ఒక రకంగా మెజారిటీ ప్రజలను గమనిస్తే వారికి ఏ పథకాలు అందట్లేదు. పైగా వారు కడుతున్న ప‌న్నులనే ప్రభుత్వం పథకాల రూపంలో ప్రజలకు ఉచితంగా అందిస్తోంది. కాబట్టి ఇది చాలా సున్నితమైన విషయం. పథకాలు ఇవ్వాలా వద్దా అనేది ఎంత ముఖ్యమో పన్నులు కడుతున్న వారు తమ సొమ్మును ప్రభుత్వం ఉచితంగా ధారపోస్తోంది అనే వాదన రాకుండా వారికి ఆ బాధ తెలియకుండా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత.

ఈ బాధ్యతను విస్మరించబట్టే జగన్ ఆనాడు బద్నామయ్యారు. నేను కడుతున్న పన్నులతో జగన్ వృధా చేస్తున్నాడని మధ్యతరగతి వర్గాల నుంచి భారీ ఎత్తున వినిపించింది. వ్యాపార వర్గాల నుంచి మరింత ఎక్కువగా వినిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ వాదాన్ని రాకుండా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఒకపక్క సంక్షేమాన్ని అమలు చేస్తూనే మరొక వైపు అభివృద్ధిని సమాంతరంగా తీసుకు వెళ్లడం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి కుటుంబాలకు ఒకవైపు మేలు చేస్తూ మరోవైపు పన్నులు క‌డుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి వర్గాలను సంతృప్తిపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

ఈ రెండు రైలు పట్టాల వంటివి. ఎవరినీ విస్మరించలేని పరిస్థితి. సంక్షేమం ఆపిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అలాగే ఒక్క సంక్షేమం వైపు ఉంటే మేము పన్నులు కడుతున్నాం అన్నటువంటి వారు తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెండు రైలు పట్టాల మధ్య ఉన్న గ్యాప్ ని అర్థం చేసుకోవడంలో జగన్ గతంలో విఫలమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు సఫలం అవుతున్నారు. అంతే తేడా. పథకాలు అయితే అమలు అవుతాయి. కానీ గ్యాప్‌ ఏదైతే ఉందో ఆ ఆలోచన పనిచేయటం ఉందో దానిని సూక్ష్మంగా గ్రహించి అమలు చేయడంలో చంద్రబాబు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

త‌న హ‌యాంలో జగన్ అభివృద్ధి చేశానని చెప్పుకున్నా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడడానికి కారణం కేవలం ఆయన నాణానికి ఒక వైపే చూడడం ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు చేపట్టే దీక్షలు కానివ్వండి, ఇప్పుడు చేపట్టే కార్యక్రమాలు కానివ్వండి ఇవి ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనేది ప్రశ్నార్ధకం. మెజారిటీ ప్రజలు అభివృద్ధివైపు ఉన్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి, విద్య ఇవన్నీ కోరుకుంటున్నారు. లబ్ధి పొందుతున్న కుటుంబాలకు ఎంత ఇచ్చిన తక్కువనే వాదన కూడా సమాజంలో ఉంది. కాబట్టి జగన్ ఆచితూచి అడుగులు వేస్తే తప్ప ప్రయోజనం కలగడం కష్టం అనేది పరిశీలకులు చెబుతున్న మాట.