ర‌ఘురామ ఆగ్ర‌హించిన వేళ‌.. ఏం జ‌రిగింది?

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు రాజ‌కీయ నాయ‌కుడిగానే కాకుండా.. విశ్లేష‌ణా ప‌రుడిగా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే త‌త్వం ఉన్న వ్య‌క్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. పార్టీలు ఏవైనా.. ప‌ద‌వులు ఎన్నున్నా.. ఆయ‌న శైలిలో మాత్రం మార్పు పెద్ద‌గా క‌నిపించ‌దు. ఉన్న‌ది ఉన్న‌ట్టు.. కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డమే ఆయ‌న నైజం. ఇది కొంద‌రికి న‌చ్చొచ్చు.. కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అయినా.. ర‌ఘురామ మాత్రం చెప్పాల్సింది చెప్పేస్తారు. గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి పాల‌న‌పై రోజు నిప్పులు చెరిగేవారు. ప్ర‌జ‌ల కోణంలో ఆలోచించాల‌ని చెప్పేవారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చాక కూడా.. ఒక‌టి రెండు సార్లు చిరు కోపం ప్ర‌ద‌ర్శించారు. అది కూడా.. అధికారుల ప‌నితీరు స‌రిగాలేద‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. ఒక‌రిద్ద‌రు అధికారులు చేసే పనుల కారణంగా యావ‌త్ కూట‌మి ప్ర‌భుత్వం కూడా అభాసుపాల‌వుతుంద‌న్న ఆవేద‌న ఆయ‌న మాట‌ల్లో క‌నిపించింది. తాజాగా ఇలాంటి విష‌యంపైనే ర‌ఘురామ మ‌రోసారి ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. చిరు కోపం ప్ర‌ద‌ర్శించారు. “ఇలా అయితే.. ఎలా!” అంటూ సుతిమెత్తగా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఒకింత గ‌ట్టిగానే హెచ్చ‌రించారు.

ఇంత‌కీ ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అమ‌రావతిలో ‘సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు’ పేరిట కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని.. ఎమ్మెల్యేల‌కు అవ‌మానం జ‌రిగింద‌ని ర‌ఘురామ చిరు కోపం ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు.. స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌ల‌కు అస‌లు ఆహ్వానం కూడా లేకపోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేద‌న్నారు.

తాను ఈ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌లేద‌న్న ర‌ఘురామ‌.. ఒక‌వేళ వెళ్లి ఉంటే.. అక్క‌డి ప‌రిస్థితులు చూసి మ‌ధ్య‌లో నే బ‌య‌ట‌కు వ‌చ్చేసి ఉండేవాడిన‌ని వ్యాఖ్యానించారు. “కలెక్టర్‌, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్‌ వద్ద కూర్చోబెట్టారు. మరో టేబుల్‌ వద్ద కార్పొరేషన్‌ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారు. ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఎంపీ, ఎమ్మెల్యేలు.. అధికారుల‌కు వేర్వేరుగా సీటింగ్ ఉండాలి. అంటే ప్రొటోకాల్ పాటించ‌లేదు. ఇది స‌రికాదు. నేను వెళ్లి ఉంటే .. మ‌ధ్య‌లోనే వ‌చ్చేసేవాడిని. ఈ విషయాన్ని కొంద‌రు ఎమ్మెల్య‌లు నాకు చెప్పారు. ” అని ర‌ఘురామ పేర్కొన్నారు.