రేవంత్ రెడీ అవుతుండగానే హైకోర్టు తీర్పు!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబందించిన ఓ ప్రకటన విడుదల అయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో అయితే ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికన్న ప్రచారమూ జరిగింది. అయితే రిజర్వేషన్ల ఖరారు భారీ కసరత్తుతో కూడుకున్నది కదా… అందుకే ఓ మోస్తరు ఆలస్యం అవుతోంది. ఇలాంటి క్రమంలో బుధవారం మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది.

వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలు, సంక్షేమ పథకాల అమలు, కొత్తగా పదవీ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించేందుకు కొంత సమయం అయితే పట్టింది. ఎన్ని చెప్పినా… మరీ స్థానిక సంస్థలకు ఏడాదిన్నరగా ఎన్నికలు జరపకుండా ఉండటం అన్నది ఏ ఒక్కరూ అంగీకరించే విషయం అయితే కాదు. ఇక ఇటీవల కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన కుల గణన విషయంలో బీసీల జనాభా 42 శాతం ఉండగా… ఆ మేరకు స్థానిక సంస్థల్లోనూ తమకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కూడా స్థానిక పోరును జాప్యం చేసిందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే… గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లుగా పనిచేసిన ఓ ఆరుగురు మాజీ సర్పంచ్ లు ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగానే వాయిదా వేస్తూ స్థానిక సంస్థల అబివృద్దికి అడ్డుకట్ట వేస్తున్నారని, వీలయినంత త్వరగా ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తన తీర్పును వెలువరించింది. మూడు నెలల్లోగా… అంటే… ఈ మాసాన్ని వదిలేసి.. జూలై 1తో మొదలుకొని సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు… ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు అన్న విషయంపై చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని హైకోర్టు చెప్పడం పెద్ద విషయమేమీ కాదని, ఇది ప్రభుత్వానికి ఏమీ ఇబ్బందికరమైన పరిస్థితి కాదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లు తేలితే… హైకోర్టు నిర్దేశించిన గడువులోగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసినా ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.