చ‌ర్చ‌లంటూనే.. లీగ‌ల్ ఫైటా..

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య చోటు చేసుకున్న జ‌ల వివాదంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. దీనిపై న్యాయ‌ప‌ర‌మైన పోరాటానికి సిద్ధం కావాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఎలా వెళ్లాలి? ఏం చేయాల‌నే దానిపై న్యాయ‌వాదుల నుంచి, అదేవిధంగా అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ నుంచి అభిప్రాయాలు తీసుకుని ఒక ఫైల్ రెడీ చేయాల‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారులను ఆదేశించారు. దీనికి రెండు రోజులే గ‌డువు విధించారు. త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారాన్ని న్యాయ‌ప‌రంగానే తేల్చుకుందామ‌ని వ్యాఖ్యానించారు.

దీంతో ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదం కీల‌క మ‌లుపు తిరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. ఏపీ ప్ర‌భుత్వం కేంద్రాన్ని ఆశ్ర‌యించి.. జ‌ల వివాదాల‌ను చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించే మార్గాల‌పై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు మంత్రివ‌ర్గానికి సూచించారు. దీనికి అంద‌రూ ఓకే చెప్పారు. అంతేకాదు.. కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లేందుకు.. మంత్రుల‌తో కూడిన క‌మిటీని కూడా వేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు కూడా మొద‌లైంది.

ఏంటీవివాదం.. ?

క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల గ్రామంలో బ‌న‌క‌చ‌ర్ల పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గోదావ‌రి న‌ది నుంచి స‌ముద్రంలో క‌లిసే నీటిని పోల‌వ‌రం ప్రాజెక్టు ద్వారా వెన‌క్కి మ‌ళ్లించి బ‌న‌క‌చర్ల‌లో నిల్వ చేస్తారు. ఈ నీటిని.. రాయ‌ల సీమ‌లోని సాగు, తాగునీటికి వినియోగిస్తారు. స‌ముద్రంలోకి ప్ర‌స్తుతం 3 వేల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. దీనిలో 200 టీఎంసీల నీటిని బ‌న‌క‌చ‌ర్ల ద్వారా వాడుకోవాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. అయితే.. దీనికి తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా.. అక్క‌డి విప‌క్షాలు అడ్డు చెబుతున్నాయి. ఇలా చేస్తే.. గోదావ‌రిలో వ‌ర‌ద జ‌లాలు లేనప్పుడు కూడా.. త‌మ నీటిని ఏపీ వాడేస్తుంద‌ని ఆరోపిస్తున్నారు.

అంతేకాదు.. గోదావ‌రిపై ఇప్ప‌టికే క‌ట్టిన పోల‌వ‌రం ద్వారా న‌ష్టం వ‌స్తోంద‌ని.. దీనిని ఆపేయాల‌ని బీఆర్ ఎస్ నాయ‌కురాలు క‌విత గ‌తంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌ను తెర‌మీదికి తెస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప‌లుమార్టు కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లి బ‌న‌క‌చ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా నివేదిక‌లు ఇచ్చారు. ఈ విష‌యం తెలిసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ర‌గ‌డ వ‌ద్దు.. చ‌ర్చించుకు ని ప‌రిష్క‌రించుకుందామ‌ని అంటున్నారు. దీనికి దాదాపు తెలంగాణ సీఎం కూడా ఓకే చెప్పారు. కానీ.. ఇంత‌లోనే స్థానిక ఎన్నిక‌లకు ముహూర్తం రెడీ అవుతుండ‌డంతో ప్ర‌భుత్వం వెంట‌నే యూట‌ర్న్ తీసుకుని.. బ‌న‌క‌చ‌ర్ల‌పై న్యాయ పోరాట‌మే క‌రెక్ట్ అన్న‌ట్టుగా నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.