ఈ మధ్య పొలిటికల్ మైలేజీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలేవీ ఆశించిన ఫలితాన్నివ్వట్లేదు. ముఖ్యంగా ఇటీవలి పల్నాడు పర్యటన తీవ్ర వివాదాస్పదం అయింది. ఎప్పుడో ఏడాది కిందట, అది కూడా బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఇన్నాళ్ల తర్వాత పరామర్శించడానికి వెళ్లడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పర్యటన సందర్భంగా వేర్వేరు కారణాలతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశం అయింది. ఒకరు ర్యాలీ సమయంలో ఊపిరాడక చనిపోతే.. ఒకరు జగన్ కారు కింద పడడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు అంబులెన్సులో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి చనిపోయారు.
ఏడాది ముందు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే.. ముగ్గురి ప్రాణాలు పోయాయంటూ జగన్ మీద సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. సింగయ్య అనే వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ జగన్ మీద పోలీసులు కేసులు కూడా పెట్టారు.
ఈ వ్యవహారంలో సామాన్య జనం జగన్ తీరును తప్పుబడుతుంటే.. వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు మాత్రం అయ్యో పాపం జగన్ అంటూ సాక్షి ఛానల్లో మాట్లాడిన తీరు చర్చనీయాంశం అయింది. జగన్‌కు వచ్చిన కష్టం గురించి చెబుతూ ఆయన లైవ్‌లో కన్నీళ్లు పెట్టేసుకోవడం.. కళ్లు తుడుచుకోవడం.. యాంకర్ ఆయన్ని ఊరుకోండంటూ ఓదార్చడం.. ఇలా విడ్డూరమైన సన్నివేశాలు కనిపించాయి ఆ చర్చా కార్యక్రమంలో. జగన్ పేదవాళ్ల కోసం ఎంతో చేశారని.. ప్రపంచంలో ఎవరికీ లేని మానవత్వం ఆయనకు ఉందని.. అలాంటి వ్యక్తికి మానవత్వం లేదని అంటారా అంటూ జూపూడి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఒకసారి జగన్ మొహం చూడాలని.. నిద్ర లేక పీక్కుపోయిందని.. ఆయన జనం కోసమే రేయింబవళ్లు ఆలోచిస్తూ నిద్ర కూడా పోవట్లేదని.. జనం కోసం కార్లలో తిరుగుతున్నారని.. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారని.. జగన్ ఇంత కష్టపడుతుంటే ఆయనకు మానవత్వం లేదని అంటారా అంటూ కన్నీళ్లు పెట్టేసుకున్నారు జూపూడి.
ఐతే అధికారంలో ఉండగా జగన్ ఎంతటి వైభవం చూశారో అందరికీ తెలుసని.. పది కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్ వాడిన వ్యక్తి ఆయన అని.. ఇప్పుడు కూడా బెంగళూరులోని ప్యాలెస్‌లో సేదదీరుతూ, వారానికో పది రోజులకో ఒకసారి ఏపీకి వచ్చి పోతున్న ఆయన గురించి జూపూడి గుండెలు బాదుకుంటూ ఏడవడం జోక్ ఆఫ్ ద ఇయర్ అంటూ జూపూడి మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates