పవన్ కు కట్టప్ప వార్నింగ్..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలి తమిళనాడు పర్యటన అక్కడ అగ్గి రాజేసింది. తమిళనాడులోని మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన పవన్… సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. నకిలీ సెక్యూలరిజంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపుగా పవన్ కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.

దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమన్న సత్యరాజ్… పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమను ఎవరూ మోసం చేయలేరని అన్నారు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి వక్కువ తనమే అవుతుందని ఆయన ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే…మురుగన్ మానాడులో పవన్ కల్యాణ్ పాల్గొనడం, ప్రసంగించడంపై డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అసలు తమిళనాడుతో మీకేం సంబంధం అని కూడా పవన్ ను ప్రశ్నించిన శేఖర్… మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కూడా ఆయన పవన్ కు సవాల్ విసిరారు. తాజాగా సత్యరాజ్ ఏకంగా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించడం గమనార్హం.