వైసీపీ నాయకులు ఇటీవల కొన్నాళ్లుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మాదే గెలుపు! మాదే విజయం.. జగన్ పక్కా సీఎం.. అంటూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపి స్తున్న వైసీపీ నాయకులు.. ప్రజలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు. అందుకే తమకు గెలుపు అవకాశాలు మెరుగు పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే.. వైసీపీకి వచ్చే ఓట్లెన్ని.. సీట్లెన్ని? అసలు వైసీపీ ముచ్చట తీరుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో మూడు అంశాలు తెరమీదికి వచ్చాయి.
1) వైసీపీ సంస్థాగత బలం: ఈ విషయంలో 2024 నాటి లెక్కలు తీసుకుంటే.. అప్పట్లో బలమైన నాయకులు వైసీపీని నడిపించారు. విజయసాయిరెడ్డి సహా బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి బలమైన నాయకులు వైసీపీ జెండా పట్టుకుని.. కార్యరంగంలోకి దిగారు. ఇక, ఐదేళ్లపాటు.. జగన్ సంక్షేమం అమలు చేశామని చెప్పుకొచ్చారు. అయినా.. ప్రజలు వైసీపీని విశ్వసించలేదు. ఈ క్రమంలోనే 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇక, గత ఏడాది కాలంలో పార్టీ దాదాపు నిర్వీర్యమై పోయింది. ప్రజాబలం.. ప్రజలను కదిలించే వ్యూహం ఉన్న నాయకులు జంప్ చేసేశారు. ఇక, ఇప్పుడున్నవారిలోనూ.. బలమైన ప్రజా మద్దతు ఉన్న ధర్మాన సోదరులు వంటి నాయకులు మౌనంగా ఉన్నారు. సో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అసలు నాయకులను ఎదుర్కొనే బలమైన విపత్తు పార్టీని వెంటాడుతుంది.
2) సీఎంగా జగన్: ఇటీవల నిర్వహించిన రెండు కీలక సర్వేల్లో జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రశ్నకు ప్రజల నుంచి 28 శాతం మార్కులు మాత్రమే పడ్డాయి. అంటే.. 28 శాతం మంది మాత్రమే ఆయనను సీఎంగా కోరుకుంటున్నారు. ఇది చాలా కష్టం. 2019తో పోల్చుకుంటే.. దాదాపు సగానికిపైగా జనాలు ఇప్పుడు ఆయనను తిరిగి కోరుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. సో.. ఇది కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చూపే తీవ్ర ప్రభావమేనని చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.
3) పుంజుకోని గ్రాఫ్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కొనేందుకు పార్టీలు, నాయకులు సిద్ధంగా ఉండాలనేది సాధారణ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి అర్ధమవుతుంది. ఈ రకంగా చూసుకుంటే. వైసీపీ గత ఏడాదికాలంలో పుంజుకున్న పరిస్థితి లేదు. పైగా అరాచక పార్టీ అనే ముద్రను జోడించుకునే క్రమంలో అలుపెరుగకుండా పరుగులు పెడుతోంది. దీంతో పార్టీపై ఉన్న ఆశలు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం కూడా వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో నాయకగణం లేకపోవడం.. కార్యకర్తలు బయటకు రాకపోవడం.. ప్రజల ఆలోచనా విధానానికి వైసీపీ ఆవేశ పూరిత చర్యలకు మధ్య లింకు కుదరకపోవడంతో వైసీపీ గ్రాఫ్ ఇబ్బందుల్లో పడింది. సో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. వైసీపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates