వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. `జగన్ రాజకీయాలకు పనికి రాని పువ్వు` అని ఆమె పేర్కొన్నారు. “అసలు రాజకీయాలంటే.. ఏంటో కూడా తెలియని జగన్.. రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు“ అని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో జగన్ ఈ నెల 18న నిర్వహించిన పరామర్శ యాత్ర సందర్బంగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త కాన్వాయ్ కింద పడి మృతి చెందిన ఘటనపై తొలిసారి అనిత స్పందించారు. ఇది ముమ్మాటికీ.. జగన్ చేసిన ఘటనేనని పేర్కొన్నారు.
ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు స్పృహలేని నాయకులు ఎవరూ ఉండరని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని.. కానీ, జగన్‌లో ఆ స్పృహలోపించిందన్నారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, కానీ.. జగన్ తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం.. తనకు నచ్చినట్టు వ్యవహరించడం వంటివి తగదని చెప్పుకొచ్చారు. అందుకే జగన్ రాజకీయాలకు పనికిరాడని అంటున్నామన్నారు. ‘‘పొదిలిలో రైతులను పరామర్శించేందుకు వెళ్లి.. అక్కడ మహిళలపై చెప్పులు, రాళ్లు వేయించారు. రెంటపాళ్లలో ఎప్పుడో చనిపోయిన బెట్టింగ్ రాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి.. కార్యకర్త మరణానికి కారణమయ్యారు“ అని అని ఆరోపించారు.
కనీసం జగన్ కు జాలి, దయ వంటివి కూడా తెలియదని అనిత పేర్కొన్నారు. కారు కింద కార్యకర్త నలిగిపోయినా.. పట్టించుకోని నాయకుడు ఈయనేనని చెప్పారు. “దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమో.“ అని వ్యాఖ్యానించారు. కానీ, జగన్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేయకుండా.. దీనిని కూడా కూటమి ప్రభుత్వంపై తోసేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇద్దరు కార్యకర్తలు చనిపోయినా.. ఈ పర్యటన సక్సెస్ అయిందని ప్రకటించుకున్న ఏకైక నాయకుడు జగనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచ్చరచ్చ చేశారు. పొదిలి వెళ్లినప్పుడు కూడా మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేశారు. రెంటపాళ్ల వెళ్లినప్పుడు పోలీసుల నిబంధనలు పట్టించుకోలేదు. ఇలాంటి వారిని నాయకుడు అనాలా? ఇంకేమైనా అనాలా?“ అని వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. బలప్రదర్శన చేయడానికే జగన్ బయటకు వచ్చాడని వ్యాఖ్యానించారు. పైగా `రప్పా రప్పా` అంటే తప్పేంటని అడగడం ఆయన మానసికంగా ఏదో వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. “జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం లేదు. ఆయన రాజకీయంగా పనికిరాని పువ్వు“ అని ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates