కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్.. వైసీపీ అధినేత జగన్ పై తొలిసారి విమర్శలు గుప్పించారు. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా.. జగన్‌పై పన్నెత్తు మాట అనని ఠాకూర్ తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల సమీపంలో జగన్ కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటనపై సీరియస్ కామెంట్లే చేశారు. దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
జగన్ నాయకుడుకాదన్నారు. ఆయనలో నాయకత్వలక్షణాలు కూడా లేవని ఠాకూర్ వ్యాఖ్యానించారు. అసలు… అంత మంది జనాన్ని తరలించేందుకు.. అదేమైనా ఎన్నికల ప్రచారమా? అని నిలదీశారు. అంతేకాదు.. కారు డోర్ పక్కన నిలబడి.. చేతులు ఊపుకుంటూ.. ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందో జగన్ చెప్పాలని ఠాకూర్ నిలదీశారు. ఒక వ్యక్తి ఎప్పుడో చనిపోతే.. ఇప్పుడు పరామర్శించారు. ఈ పర్యటన ద్వారా మరో ఇద్దరిని బలితీసుకున్నారని అన్నారు.
“సింగమయ్య మృతి చెందిన తీరు నన్ను ఎంతో కలచి వేసింది. ఇది జగన్ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. ఆయనలో నాయకుడి లక్షణాలులేవు. ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడో విఫలమయ్యాడు. ఇప్పుడు నేర పూరిత నిర్లక్ష్యం ప్రదర్శించారు. మనుషుల జీవితాలంటే.. జగన్‌కు అర్థం కూడా తెలియదు. ఎవరు ఏమైపోయినా.. తన కాంక్ష తీర్చుకునే క్రమంలో వ్యవహరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై తీసుకునే కఠిన చర్యలకు తాము మద్దతు ఇస్తాం.” అని మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates