వైసీపీ అధినేత జగన్ పై మరో కేసు నమోదు అయ్యింది. మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఏటుకూరు బైపాస్ వద్ద చనిపోయిన సింగయ్య.. సాక్షాత్తు జగన్ వాహనం కింద పడి నగిలిపోయినట్లుగా తాజాగా వీడియోలు విడుదలయ్యాయి. జగన్ ఓ వైపు పార్టీ శ్రేణులకు అబివాదం చేస్తుంటే…అదే సమయంలో సింగయ్య ఆయన కారు కిందే నలిగిపోయారు.
ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలను పరిశీలించిన పల్నాడు పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణా రెడ్డిని ఏ1గా, జగన్ ను ఏ2గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్న మరింత మంది ఎవరన్న విషయంపై ఆరా తీస్తున్న పోలీసులు వారిపైనా కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్లే కనిపిస్తోంది.
రెంటపాళ్ల జగన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వగా… వాటిని జగన్ గానీ, వైసీపీ నేతలు, శ్రేణులు గానీ పట్టించుకున్న పాపానే పోలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మరీ వీధి రౌడీ మాదిరిగా పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్ లను తొలగించి మరీ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కోణంలో ఆయనపై కేసు తప్పదన్నవాదనలు వినిపిస్తుండగా… అంతకు ముందే జగన్ పైనే ఏకంగా కేసు నమోదు కావడం గమనార్హం.
జగన్ కు కేసులు కొత్తేమీ కాదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి ప్రజా ధనాన్ని దోచుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఏకంగా 11 కేసులు నమోదు చేసింది. ఇవే కేసుల ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఆయనపై 11 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్ ఏకంగా 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. అలాంటి జగన్ కు ఇలాంటి యాక్సిడెంట్ కేసులు ఏమంత పెద్దవి కావన్న వాదనలు వినిపిస్తున్నా… సీఎంగా పనిచేసిన జగన్ పై ఇలాంటి హత్య కేసులు నమోదు కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates