కూటమి పార్టీల్లో కీలకమైన జనసేనలో నాయకులు చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైకి ఎవరూ మీడియా ముందుకు రారు. సంచలన ప్రకటనలు కూడా చేయరు. అంతేకాదు.. ఏం చేసినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు క్రెడిట్ దక్కాలని కోరుకుంటున్నారు. దీంతో వారు ఒకరకంగా ఆదర్శంగాను.. మరో రకంగా.. పనిమంతులుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే.. ఆరణి శ్రీనివాసులు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పేరు వచ్చింది.
దీంతో పార్టీ ఆయనకు సైలెంట్‌గానే వార్నింగ్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆరణి అలెర్టు అయ్యారు. వెంటనే నియోజకవర్గంలోని మండలాల్లో తిరుగుతున్నారు. సమస్యలు తెలుసుకుంటు న్నారు. తనవ ద్దకు వచ్చే వారికి ఒకప్పుడు రెడ్ సిగ్నల్ చూపించిన ఆయనే ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి అందుబాటులో ఉంటున్నారు. ఇక, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కూడా.. తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై బాగానే పనిచేస్తున్నారనే మార్కులు వేయించుకున్నారు.
తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కూడా.. గతానికి భిన్నంగా ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలు స్తోంది. కొన్నాళ్ల కిందటి వరకు ఆయన వివాదాల కేంద్రంగా రాజకీయాలు చేశారు. అయితే.. పార్టీ నుంచి బలమైన హెచ్చరికలు రావడంతో తన తీరును మార్చుకున్నారు. తాజాగా ఆయన టీడీపీ నాయకులకు విందు ఏర్పాటు చేసి.. స్థానిక సమస్యలపై కలిసి పోరాటానికి దిగుదామని సూచనలు చేయడం గమనార్హం. అదేవిధంగా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కూడా అందుబాటులో ఉంటున్నారు.
నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న మండలి.. పార్టీ సూచనలతో మకాం మార్చి నియోజకవర్గం లో అందుబాటులో ఉంటున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే వివాదాలకు కేంద్రంగా మారారన్న వాదన నుంచి ఇప్పుడిప్పుడే.. మారుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. సమస్యలు పట్టించుకుంటున్నారు. అంతేకాదు.. తన నియోజకవర్గంలో 30 మందికి సొంత సంస్థల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చి ఆదుకున్నారు. ఇలా.. ఒక్కొక్కరు తమ పంథా ను మార్చుకుంటున్నారని పార్టీ నాయకత్వానికి నివేదికలు అందాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates