అక్క‌డ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ క్రేజ్ మ‌రింత పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజకీయంగా మాత్రం ఒక్కో పరీక్షలో విజయం సాధిస్తూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మొదలైన విజయ పరంపరను.. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఉప ఎన్నికల్లో కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయానికొస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ కూడా ఇచ్చారు.

అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక‌ నోటిఫికేషన్ విడుదల కానుంది. అందరికంటే ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక‌పై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలోను విజయం సాధించేందుకు గాంధీభవంలో ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు.. అయినా ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తన ఖాతాలో వేసుకుంటే పార్టీకి మంచి ఊపు వస్తుంది అన్నదే రేవంత్ రెడ్డి వ్యూహం. వాస్తవానికి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోను బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ లాగేసుకుంది. అది రేవంత్‌కు అధిష్టానం ద‌గ్గ‌ర‌ ప్ల‌స్ పాయింట్ అయ్యింది.

గత ఎన్నికలలో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేశారు. మజ్లిస్‌ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. ఎన్నికల తర్వాత నవీన్ యాదవ్ కాంగ్రెస్ లో చేరారు. ఇలా అన్ని రకాల బలాబలాలు కలుపుకుంటే జూబ్లీహిల్స్ లో గెలిచి గ్రేటర్లో సత్తా చాటాలని రేవంత్ ఇప్పటికే పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఎన్నికల తర్వాత మజ్లిస్ – కాంగ్రెస్ దోస్తీ బాగుంది. మజ్లీస్ గ‌త ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మజ్లిస్ అధి నాయకత్వం రేవంత్ రెడ్డితో బాగా సఖ్యత ఉంటుంది.

ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకం. ఎంఐఎం ఓటు బ్యాంకు ఎక్కువే.. మజిలీస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. కాంగ్రెస్ – ఎమ్ఐఎం మద్దతుతో జూబ్లీహిల్స్ లో బాగా వేయాలని పావులు కదుపుతోంది. ఎంఐఎం బ‌రీలో దిగకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఖచ్చితంగా వార్‌ వన్ సైడ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఆశావాహులు జాబితాలో గతంలో ఓడిపోయిన అజరుద్దీన్ మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. నవీన్ యాదవ్ కూడా హస్తం గుర్తు మీద ఒక ఛాన్స్ అంటున్నట్టు తెలుస్తోంది. అటు పిజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫ‌సియుద్దీన్‌ కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆశావాహుల‌ జాబితా మరింత పెరుగుతుందని అంటున్నారు. మరి రేవంత్ ఎవరికి టిక్కెట్ ఇప్పించుకుని ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించుకుంటారో చూడాలి.